న్యూస్‌నెట్‌వర్క్, జూలై 3(నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏక కాలంలో తెలంగాణలో 1.50 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగేలా 4.60 లక్షల ఎకరాల భూములకు పోడు పట్టాలు అందించారు. వారిని భూములకు యజమానులను చేయడంతోపాటు రైతుబంధు, రైతుబీమా వర్తింపజేయడంతో గిరిపుత్రులు సంబురపడుతున్నారు. ఇం దులో భాగంగా సోమవారం పలు జిల్లాల్లో మంత్రు లు, ఎమ్మెల్యేలు గిరిజనులకు పోడు పట్టాలు అందజేశారు. ములుగు జిల్లా సమ్మక-సారక తాడ్వా యి మండలం మేడారంలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో కలెక్టర్ కృష్ణఆదిత్య అధ్యక్షతన పోడు భూముల పట్టాలు, ప్రభుత్వ నిషేధిత సంస్థల్లో పనిచేస్తూ లొంగిపోయిన కుటుంబాలకు ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ముఖ్యఅతిథిగా హాజరైన గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. పోడు హకుల చట్టం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో విడుతల వారీగా 3 లక్షల ఎకరాలకు పట్టాలు అందిస్తే.. సీఎం కేసీఆర్ రికార్డు స్థాయిలో ఒకే విడుతలో 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించి దేశంలోనే తెలంగాణను రోల్‌మాడల్‌గా నిలిపారని కొనియాడారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ర్టాల్లో రూ.4 వేల పింఛన్ ఇవ్వాలనే సోయి లేనోళ్లు.. తెలంగాణలో ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రాష్ర్టాల్లో ఇచ్చి చూపించాలని సవాల్ చేశారు.
యాదాద్రి కలెక్టరేట్లో పోడు రైతులకు పట్టాల పంపిణీని జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. చెన్నూర్‌లో నియోజకవర్గంలోని 666 మంది గిరిజనులకు 1,190 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 12 గ్రామాల్లోని 3,469 మందికి రైతులకు జడ్పీ చైర్మన్ అంగోత్ బిందుతో కలిసి ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మహ్మద్ షకీల్ నవీపేట్ మండలంలోని లబ్ధిదారులకు పోడు పట్టాలను, రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామ లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి కుమారుడికి పోడు పట్టా
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ కుమారుడికి కూడా పోడు పట్టా అందించడమే అందుకు నిదర్శనం. ఇప్పటికే అఖిల్ రాథోడ్ పేరుతో దామరచర్ల మండలంలో 3.13 ఎకరాలకు పోడు పట్టాదారు పుస్తకం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో దామరచర్ల మండలంలో జరిగే కార్యక్రమంలో మిగతా లబ్ధిదారులతో పాటు అఖిల్ రాథోడ్‌కు కూడా పట్టా అందజేయనున్నారు. ఈ విషయాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వెల్లడించారు.