Bonalu Festival | సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఎంతో చరిత్ర కలిగిన ముత్యాలమ్మ బోనాల పండుగలో మంత్రి జగదీశ్‌రెడ్డి, సునీతా దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజలపై ఊర ముత్యాలమ్మ కరుణా కటాక్షాలు చూపాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రకృతికి అనుకూలంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నందున అమ్మవారితో పాటు ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తద్వారా పంటలు బాగా పండి ప్రజల ఆదాయం పెరగాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నానన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు గ్రామ దేవతలను కొలుస్తూ బోనాల పండుగ నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుందన్నారు. అలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.