Minister Jagadish Reddy | ఉద్యోగల భర్తీపై తాము చర్చకు సిద్ధమేనని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమేనా? అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ దీపికా, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పదేళ్ల నుంచి పదివేల ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారని, నిరుద్యోగో మార్చ్ అంటూ హడావుడి చేయడం ముమ్మాటికి నిరుద్యోగులను వంచనకు గురి చేయడమేనన్నారు. నిరుద్యోగ మార్చ్ చెయ్యాల్సి వస్తే అది గల్లీలో కాదని ఢిల్లీలో చేయాలని సూచించారు. ఇక్కడ చేసేది రాజకీయ నిరుద్యోగ మార్చ్ అంటూ సెటైర్లు వేశారు.
అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల ఉద్యోగాల భర్తీ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీకి వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించాలన్నారు. ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు సంవత్సరానికి 2లక్షల మంది ఉద్యోగులను వీధినపడేసిన ఘతన మోదీ అంటూ విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ దిక్కుమాలిన పార్టీగా మారిందని, అలాంటి పార్టీకి తెలంగాణలో ఉన్నది నాలుగే ఈకలన్నారు. ఆ నాలుగు ఈకలు కూడా ఎవరిగోలలో వారే ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయాలతో లీకేజీల ప్రహసనం ఓ భాగమని ఆయన మండిపడ్డారు. దేశాన్ని ఏలుతున్న పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లీకేజీలో అడ్డంగా దొరికిపోయాడంటూ ధ్వజమెత్తారు. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి బీ టీంగా పని చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.