హైదరాబాద్: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) తోడ్పాటుతో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. మెరుగైన సౌకర్యాలు, ఆన్లైన్ సేవలు కల్పించడంతో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మవారి ఆలయంలో భక్తుల సదుపాయం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పర్వదినాలలో అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయన్నారు. అదేవిధంగా ఆలయాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం దశ లవారీగా అమలు చేస్తున్నదని చెప్పారు. ఆధ్యాత్మిక, ఆహ్లాదకరంగా ఉండేలా భక్తులకు అన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తోందని వెల్లడించారు.
దాతల సహకారంతో రూ.8 లక్షల వ్యయంతో ఎల్లమ్మ అమ్మవారి ఆలయ రాజగోపుర ద్వారానికి గల రాగి తొడుగులపై బంగారు పాలిష్ చేయించారు. అదేవిధంగా రూ. 3 లక్షల వ్యయంతో టేకుతో చేయించిన శ్రీ పోచమ్మ ఆలయ ద్వారాలకు రాగి రేకులతో కూడిన బంగారు పాలిష్, రూ. 2.75 లక్షల వ్యయంతో టికెట్ వెండింగ్ మెషిన్, రెండు 5 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్లను మంత్రులు ప్రారంభించారు.