హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిషారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారుల సమస్యలపై శాశ్వత పరిషారంతోపాటు భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై బుధవారం అరణ్యభవన్‌లో జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో కమిటీల ఏర్పాటు, కమిటీల బాధ్యత, క్షేత్రస్థాయిలో పోడు భూములను సంరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
అడవులను రక్షించడానికి మండల, గ్రామ పంచాయితీ స్థాయిలో చర్చలు జరిపి, ఏకాభిప్రాయానికి రావడం, అటవీ సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించి, భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణలకు గురికాకుండా సమిష్టి బాధ్యత, పకడ్బందీ చర్యలు తీసుకోవడం, పోడు సాగులో ఉన్న భూములపై క్లెయిమ్‌లను బేరీజు వేయడం, పోడుకోసం ఆక్రమణకు గురైన అటవీ భూమిని అంచనా వేయడం, పోడు సమస్య జిల్లా స్థాయిలో పరిషారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, వనరులను ఉపయోగించుకోవడం, తదితర అంశాల గురించి మంత్రి వివరించి సందేహాలను నివృత్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. నిరుపేదలైన వారికి న్యాయం జరగడంతో పాటు అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిషారానికై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిషారం చూపుతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించి, గిరిజనుల్లో ధైర్యం నింపారని, ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లా స్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలన్న సీం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 11న ప్రభుత్వం జీవో నం. 140 జారీ చేసిందన్నారు. సంబంధిత అన్ని జిల్లాల్లో కూడా సమన్యయ కమిటీల సమావేశం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డొబ్రియల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోణప్ప విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, పీసీసీఎఫ్ ఎంసీ పర్గెయిన్ తదితరులు పాల్గొన్నారు.