బోథ్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎనిమిదేండ్లలో తెలంగాణ ముఖచిత్రమే మారిపోయిందన్నారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ జాతీయ రహదారి నుంచి కుంటాల జలపాతానికి వెళ్లే రహదారిలో రూ.3.30 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో ఎన్ని తిప్పలు పడ్డామో మనందరికీ తెలుసన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించిన పాపాన పోలేదని విమర్శించారు. సమైఖ్య రాష్ట్రంలో పడిన బాధలను గుర్తు చేసుకున్నారు.
అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా లాంటి అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉత్తమ వైద్య సేవలు, విద్యారంగంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారని.. ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.