నిర్మల్: రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ (Arogya Mahila) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మార్గనిర్దేశంలో రాష్ట్రంలోని వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగిందన్నారు. నిర్మల్ (Nirmal) పట్టణంలోని ఎంసీఎచ్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రసూతి వార్డులో పలువురికి కేసీఆర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆరోగ్య మహిళ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు కానుందని చెప్పారు.
ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొనారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ‘ఉమెన్ క్లినిక్’లు నిర్వహిస్తారని, మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఇక్కడ వైద్యం అందించనున్నారని వెల్లడించారు. ఉమెన్ క్లినిక్స్‌కు (women’s clinic) వచ్చే మహిళలకు అక్కడికక్కడే బీపీ, షుగర్, అనీమియా పరీక్షలు నిర్వహిస్తారు. వీటితోపాటు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ఈ సేవలను మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. అదే విధంగా నిర్మల్ పట్టణంలో త్వరలోనే ఇప్పుడున్న వాటితో పాటు మొత్తం 450 పడకల దవాఖానలో సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.