నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ (Basara Temple) పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సరస్వతి అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతోపాటు (Reconstruction) ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ (CM KCR) రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8 కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేపట్టగా, రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
బాసరలో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. గర్భగుడిలో మహా సరస్వతి విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది. పైఅంతస్తులో మహంకాళి విగ్రహం ఉన్నది. సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ఉండాలని ఆగమ శాస్త్రం చెబుతున్నది. అయితే ఇప్పుడు భక్తులు ప్రత్యేకంగా చూస్తే తప్ప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కనిపించడం లేదు. దాంతో ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపాన్ని తొలగించి.. కొత్తగా నిర్మించేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
ప్రాకార మండపానికి తూర్పు, పశ్చిమ దిశల్లో ఏడంతస్తులతో రెండు రాజ గోపురాలు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదు అందస్తులతో మరో రెండు రాజ గోపురాలు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇప్పుడున్న ప్రాకార మండపం మరో 50 మీటర్లు ముందుకు జరుగనుంది. ప్రస్తుతం 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడెల్పుతో ఉన్న గర్భగుడి 25.5 అడుగుల వెడెల్పు, 16.5 అడుగుల పొడవుతో పునర్నిర్మించనున్నారు. 6.5 అడుగుల వెడెల్పున్న ఆలయ ముఖ ద్వారాన్ని 18.5 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నది ఇప్పటికే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కృష్ణ శిలలతో తీర్చిదిద్దింది. ఇటీవల కొండగట్టు ఆలయానికి సైతం రూ.100కోట్లు కేటాయించింది. అలాగే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సైతం చర్యలు తీసుకుంటున్నది.