హైదరాబాద్ : పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో ఫోన్లో మాట్లాడిన మంత్రి..రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా, బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్పై వెళ్తున్న రామయ్య రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో ఆయన కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.