Minister Indrakaran Reddy | దివ్యాంగుల అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొన్నారు. పింఛన్‌ను రూ.4,116 పెంచినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రితో పాటు దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు వృద్ధులకు కేవలం రూ.200, దివ్యాంగులకు రూ.500 పింఛన్లు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మనకు మంచి రోజులవచ్చాయన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ.200 పింఛన్‌ను రూ.1,000, దివ్యాంగుల పింఛన్‌ను రూ. 500 నుంచి రూ.1,500 పెంచిందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 పింఛన్‌ను రూ.2,016, దివ్యాంగుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016 పెంచిందని చెప్పారు. ఆసరా పింఛన్ల పెంపుతోపాటు పింఛన్‌దారుల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించారని వివరించారు.
పెరుగుతున్న ధరలకనుణంగా ఏ పనిచేయలేని దివ్యాంగులకు పింఛన్ సరిపోవడం లేదనే ఆలోచనతో మంచిర్యాల సభలో కేసీఆర్ అదనంగా రూ.1000 పెంచుతున్నామని, వచ్చేనెల నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారని తెలిపారు. దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక పింఛన్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆసరా పింఛన్లు ఈ స్థాయిలో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదలకు కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధులాంటి పథకాలతో పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు.