కరీంనగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు ముందుకు రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయని, రాబోయే రోజుల్లో తమతో ప్రైవేట్ వైద్యులు పోటీ పడాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఆదివారం కరీంనగర్‌లోని వీ కన్వెక్షన్ హాల్లో జరిగిన ఐఎంఏ రాష్ట్ర సదస్సు, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యరంగంలో సీనియర్ వైద్యులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయని, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, ప్రొఫెసర్లుగా సేవలందించేందుకు వారు ముందుకురావాలని కోరారు. తెలంగాణ ఏర్పడినపుడు రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇపుడు కొత్తగా 8 మెడికల్ కళాశాలు ఏర్పాటుచేసి ఒక్కోదానికి 150 సీట్లు మంజూరు చేశామని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్లలో 12 మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసుకున్నామని, గతంలో 2,790 సీట్లు ఉంటే ఇపుడు అవి 6,615కు పెరిగాయని స్పష్టంచేశారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాలను దశలవారీగా ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మన దేశం నుంచి ఉక్రెయిన్, చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి ఉందని, స్థానికంగానే వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలు ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఎన్ఎంసీ విధానాలు సరిగ్గాలేక అనుమతులు సులభంగా అం దడం లేదన్నారు. ఒక ప్రైవేట్ దవాఖాన ఏర్పా టు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని, రాష్ట్రంలో సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు ఒకే చోట, ఒకేసారి లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేస్తు న్న కొత్త మెడికల్ కళాశాల కారణంగా ఎంబీబీఎస్ సీట్లతోపాటు పీజీ సీట్లు రెట్టింపు సంఖ్యలో పెరుగుతాయన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వందకు 44 శాతం సీ సెక్షన్ జరుగుతుండగా అదే ప్రైవేట్ హాస్పిటళ్లలో 81 శాతం వరకు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌స్పెషాలిటీ దవాఖానలను రూ.4 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి 56 రకాల పరీక్షలు నిర్వహించి రోగుల మొబైల్ ఫోన్లకే సమాచారం అందించే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో ప్రధాన దవాఖానలపై ఓపీ ఒత్తిడి తగ్గిందని మంత్రి హరీశ్ తెలిపారు. త్వరలో 950 డాక్టర్ పోస్టులు, 1,150 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని, ఇపుడు విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఐఎంఏ రిక్రియేషన్ క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖకు కొత్తగా ఎన్నికైన డాక్టర్ బీఎన్ రావు, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు డాక్టర్ సంపత్‌రావు నుంచి బీఎన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సహజానంద్ ప్రసాద్‌సింగ్, జాతీయ ఎలెక్ట్ అధ్యక్షులు డాక్టర్ శరత్‌కుమార్ అగర్వాల్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు తదితరులు, ఐఎంఏ బాధ్యులు పాల్గొన్నారు.