Minister Harish rao | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఏ పార్టీ డిక్లరేషన్లకు స్థానంలేదని, ఎవరెన్ని డిక్లరేషన్లు చేసుకున్నా తెలంగాణకు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ ప్రజలు ఇప్పటికే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొన్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ఇక్కడ డిక్లరేషన్ ప్రకటించే పార్టీలు వారు పరిపాలన చేస్తున్న రాష్ర్టాల్లో ముందుగా వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో దిక్కులేక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని, అలవికాని హామీలిచ్చి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తలపట్టుకొంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి అమిత్‌షాకు చేతనైతే గుజరాత్ గుడ్డి పాలనను సరిచేసుకోవాలని సూచించారు. గురువారం తెలంగాణభవన్‌లో ఎమ్మార్పీఎస్ నేత యాతాకుల భాస్కర్‌మాదిగ, కొర్పల్లి శ్రీనివాస్ మాదిగ, జెర్రిపోతుల నరేశ్ మాదిగ, కోటేశ్వర్రావు, సతీశ్‌యాదవ్, జేఆర్ కుమార్ మాదిగ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యాతాకుల భాస్కర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఆయన సేవలను ఉన్నతంగా వినియోగించుకొని దళిత జనోద్ధరణకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఆ పార్టీల నకిలీ డిక్లరేషన్లు, వెకిలి చేష్టలకు తెలంగాణలో స్థానం లేదని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ది స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కార్ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా తెలంగాణలో చెల్లవని హరీశ్‌రావు తేల్చి చెప్పారు. బీజేపీపై వ్యతిరేకత, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. ‘బీజేపీ మీద కక్కొచ్చి దిక్కులేక కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారనే విషయాన్ని ఖర్గే గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో ఈ డిక్లరేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకంటే కాంగ్రెస్, బీజేపీ రాష్ర్టాల్లో మెరుగైన పాలన అందిస్తున్నారా లేదా? అనే విషయాన్ని తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదనే విషయాన్ని ఆ పార్టీలు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మీద, సీఎం కేసీఆర్ మీద అపారమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు ఎవరూ నీళ్లకోసం రోడ్డుపైకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపింది కేసీఆర్. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. పేదల పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఇలాంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?’ అని ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అట్టడుగు వర్గాలకు, దళితులకు విద్య చేరువైతేనే ఆ జాతిలో చైతన్యం వస్తదన్న అంబేద్కర్ మాటలను నిజం చేస్తున్నామని చెప్పారు. ‘ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసి ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నాం. అందువల్లే నేడు దళిత బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లుగా ఎదుగుతున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ యువతుల ఉన్నత విద్య కోసం 80కిపైగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటుచేసిన నాయకుడు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో ఒక్క దళిత, గిరిజన మహిళా రెసిడెన్షియల్ కాలేజీని అయినా ఏర్పాటు చేశారా? బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆ మహనీయుడి పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపాం. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి చిత్తశుద్ధిని చాటుకొన్నాం. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటే బీజేపీ ముఖం చాటేసింది. అంబేద్కర్‌పై మాకున్న గౌరవానికి 125 అడుగుల విగ్రహం, దళితబంధు వంటి పథకాలే నిదర్శనం. ఇవ్వాళ 33 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుచేసి ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం’ అని వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. గిరిజనులకు 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పితే, బీఆర్ఎస్ ప్రభుత్వం 3,146 ఆదివాసీ గూడేలను, లంబాడా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని చెప్పారు. 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతం పెంచినట్టు తెలిపారు.
యాతాకుల భాస్కర్ మాదిగ దళిత, వామపక్ష ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అంబేదర్ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తున్నారని బలంగా నమ్మిన భాస్కర్ మాదిగ బీఆర్ఎస్లో చేరినందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఉద్యమాలకు తెలంగాణ పెట్టింది పేరు. చైతన్య ప్రాంతం. తెలంగాణ ప్రజలు తెలివైనవాళ్లు. నకిలీ మాటలు నమ్మేది కాదు తెలంగాణ జాతి. మీరెన్ని మ్యానిఫెస్టోలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరు. మీ దొంగ డిక్లరేషన్లకు తెలంగాణలో స్థానంలేదు. తెలంగాణ ప్రజలెప్పుడో డిక్లరేషన్ చేసుకున్నరు. మూడోసారి కూడా కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ అయిపోయింది.’ అని మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్, బీజేపీని ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలున్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటుందని తెలిపారు. ప్రజల కోసం సామాజిక చైతన్యంతో, సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని అన్నారు. దళితవర్గాల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ఆకర్షితులై బీఆర్ఎస్పార్టీలో చేరిన యాతాకుల భాస్కర్ మాదిగ సేవలను విస్తృతంగా వాడుకొంటామని మంత్రి హరీశ్‌రావు హమీ ఇచ్చారు. దళితులు, అణగారిన వర్గాల కోసం భాస్కర్ చేసిన సేవలను కొనియాడారు.
బీఆర్ఎస్ పార్టీ నినాదాల పార్టీ కాదని, ఇచ్చిన మాటను నిజం చేసే పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వాస్తవ పరిస్థితి ఏమిటో అక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఏఐసీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టూరిస్టుల్లా రాష్ర్టానికి వచ్చి వెళ్లారని, వారికి తెలంగాణ మీద కనీస అవగాహనలేదని ఎద్దేవా చేశారు. గుజరాత్లో గుడ్డి పాలనను సరిచేయటం చేతకాక తెలంగాణకు వచ్చి అమిత్‌షా నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. అమిత్‌షా సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంట్ కోతలతో ప్రజలు సతమతమవుతున్నారని, పట్టణాల్లో పగటిపూట కరెంట్ లేక ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. అమిత్‌షా తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదుగాక నడవదని హెచ్చరించారు. కర్ణాటకలో అలవికాని హామీలిచ్చి చతికిలబడిన మల్లికార్జున్ ఖర్గే తెలంగాణకు వచ్చి నకిలీ హామీలిస్తున్నారని ఆరోపించారు.