Harish rao | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ‘అభినందనలు ప్రియమైన అచ్చూ.. అద్భుతమైన మైలురాయిని చేరుకొని పట్టుదలతో వైవిధ్య విజయాన్ని సాధించావు’ అం టూ మంత్రి హరీశ్‌రావు తన కుమారుడు అర్చిశ్మన్ను అభినందించారు. అమెరికా బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి అర్చిశ్మన్ సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడమే కాకుండా గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డునూ కైవసం చేసుకున్నారు.
యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్‌కు హాజరైన మంత్రి హరీశ్‌రావు తన కుమారుడు సాధించిన విజయానికి పరవశించిపోయారు. ‘నా కుమారుడు, గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డు గ్రహీత అని ప్రకటించడానికి గర్వపడుతున్నాను. నా కుమారుని అద్భుతమైన విజయానికి కాదు గానీ.. అతని పట్టుదలకు, వైవిధ్య భరిత విజయాన్ని సొంతం చేసుకోవాలనే అతని అభిరుచికి గర్వపడుతున్నాను. తన నైపుణ్యంతో, అర్చిశ్మన్ ప్రపంచంలో ఆశావహ ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’ అంటూ హరీశ్‌రావు తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే ఫొటోలను ట్వీట్ చేశారు.