సిద్ధిపేట : నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. మంగళవారం ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్, తెలంగాణ నడిగడ్డపై నిర్మించిన ప్రాజెక్టు అన్నారు. తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా నీరు ఇచ్చేలా జలాశయాన్ని నిర్మించినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ స్వయంగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు అని తెలిపారు. తెలంగాణలోని సగానికిపైగా జిల్లాలకు తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్నారు. తక్కువ ముంపుతో బాహుబలి ప్రాజెక్టు అని, హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందుతుందన్నారు. నిర్వాసితులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా గజ్వేల్ పట్టణం సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించామని, నిర్వాసితుల త్యాగ ఫలితమే ప్రాజెక్టని కొనియాడారు.
నిర్వాసితుల తాగ్యాలు వెలకట్టలేనివని, ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. సీఎం కుటుంబ సైతం ఒకప్పుడు నిర్వాసిత కుటుంబమేనని, సీఎం కేసీఆర్‌కు వారి బాధలు తెలుసునన్నారు. న్యాయం ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందజేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసిన ఎండా కాలమేనని, స్వరాష్ట్రoలో ఏ కాలం చూసిన వర్షాకాలాన్ని చూసినట్టుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.