బడ్జెట్ అంటే…
గజిబిజి గణాంకాల గడబిడ కాదు.
అక్షరాల విన్యాసం అంతకంటే కాదు.
బడ్జెట్ అంటే… అనేకమంది ఆశల పరిష్కార వేదిక.
ప్రభుత్వ ప్రణాళికల సంకేత సూచిక. ఆర్థికమంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ 2022-23 ఈ కోణంలోనే సాగింది. పేర్లు మార్చి, అంకెల్ని పేర్చి, నినాదాలను కూర్చి, జనాన్ని ఏమార్చిన కేంద్ర బడ్జెట్ తరహాలో కాకుండా, సూటిగా, సుత్తి లేకుండా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా తెలంగాణ బడ్జెట్ సాగింది. ఉపన్యాసమంతా విన్నా ఎవరికేం ఇచ్చారో అర్థంకాని మోదీ బడ్జెట్ మాదిరిగా కాకుండా, ఏ పథకం, ఎప్పుడు చేపట్టాం? ఎంత ఖర్చు పెట్టాం? దాని ఫలితమేమిటి? ఇప్పుడేం చేయబోతున్నాం? అని వివరంగా, విస్పష్టంగా విశదీకరించింది కేసీఆర్ బడ్జెట్!
మాతృభూమిపై ప్రేమ ఉన్న ఒక భూమి పుత్రుడు, రాష్ట్ర భవిష్యత్తుపై అవగాహన ఉన్న ఒక దార్శనికుడు, ప్రజల అవసరాలు తెలిసిన ఒక పాలకుడు, ఆర్థికాంశాల లోతులు తెలిసిన విత్త వేత్త కలగలసి బడ్జెట్ రూపొందిస్తే ఎలా ఉంటుందో, కేసీఆర్ మార్గనిర్దేశంలో వెలువడిన బడ్జెట్ అలా ఉన్నది.
ఆడపిల్లలకు హైజీన్ కిట్లు, భవన నిర్మాణ కార్మికులకు మోటర్ సైకిళ్ల వంటి చిన్న చిన్న అవసరాలు మొదలుకొని… ఎయిర్‌పోర్టుకు మెట్రో కనెక్టివిటీ, వ్యవసాయంలో పంట మార్పిడి వంటి పెద్ద ఆలోచనల దాకా అన్నింటికీ ఈ బడ్జెట్ రోడ్‌మ్యాప్ వేసింది. పాత స్కీములన్నింటికీ కొత్త కేటాయింపులు, ప్రజల అవసరాల మేరకు దాదాపు 35 కొత్త పథకాలు, వచ్చే ఏడాది చివరికి ఏం చేయబోతున్నాం, దీర్ఘకాలిక ప్రణాళిక ఏమిటి అన్నదాన్ని బడ్జెట్ వివరించింది.
తెలంగాణ సెంటిమెంటును కేంద్రం పదేపదే ఎలా గాయపరుస్తున్నదో, రాష్ర్టానికి ఆర్థికంగా ఎట్లా అన్యాయం చేస్తున్నదో నిండు శాసనసభ సాక్షిగా బడ్జెట్ కండ్లకు కట్టింది. కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ ఎలా తలెత్తుకొని సగర్వంగా నిలబడి ముందుకు సాగుతున్నదో కూడా తెలియజెప్పింది.ఆరోగ్యానికి సాయం, సొంతింటికి సొమ్ము, 57 ఏండ్ల వారికీ పింఛన్, యువతకు ఉద్యోగాలు.. ఇలా ఈసారి బడ్జెట్లో ప్రతి వర్గానికీ వరముంది. ప్రతి జిల్లాకో పథకముంది. బడ్జెట్ అంటే ఇలాగే ఉండాలన్నట్టు ఉన్నది ఈసారి బడ్జెట్. …సారంగా, సమగ్రంగా, సంపూర్ణంగా!
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్రతి వర్గానికీ ఒక పథకం.. ప్రతి ఇంటికీ ఒక ప్రయోజనం! పాతవి కొనసాగిస్తూనే.. వాటిని విస్తరిస్తూనే.. లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూనే.. కొత్త పథకాలకు నాంది పలుకుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు. మునుపెన్నడూ లేని స్థాయిలో రూ.2,56,958 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్లో.. నిర్వహణ పద్దు రూ.1,89,274,82 కోట్లుగా, ప్రగతి పద్దు రూ.29,728.44 కోట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది. ఇందులో దాదాపు లక్ష కోట్ల రూపాయలను సొంత వనరుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకొంటుండటం విశేషం. 2015-16లో రూ.1,15,689 కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే తాజా బడ్జెట్ రూ.1,59,035 కోట్లు (161%) ఎక్కువ. గతేడాది రూ.2.31 లక్షల కోట్ల బడ్జెట్‌తో పోల్చితే ఈ బడ్జెట్ రూ.25 వేల కోట్లు ఎక్కువ.
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు చేస్తున్న ఖర్చును ఏటేటా ఇతోధికంగా పెంచుతుండటమే బడ్జెట్ పరిమాణం భారీగా పెరగడానికి కారణం. శాసనసభలో సోమవారం ఉదయం 11.30 గంటలకు హరీశ్‌రావు, అదే సమయంలో శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పేరును సార్థకం చేసుకొన్నట్టుగా వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. రూ.24,254 కోట్లను వ్యవసాయానికి కేటాయించింది. దాదాపు 35 కొత్త పథకాలకు ఈ బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. రెండున్నర లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడానికి రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు.
దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయించారు. డబుల్ బెడ్రూమ్ పథకానికి బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించి ఈసారి కొత్తగా సొంత జాగలలో ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షల చొప్పున ఇచ్చే విధానాన్ని అనుసంధానం చేశారు. కొత్త ఉద్యోగాల కల్పనకు ముందే రూ.3 వేల కోట్లను కేటాయించింది. 57 ఏండ్లు దాటినవారికి ఈ ఏప్రిల్ నుంచి ఆసరా పింఛన్లు ఇస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. గర్భిణులకు ఈ ఏడాది నుంచి పోషకాహార కిట్లను అందజేస్తారు. ఈ కిట్ ద్వారా ఏటా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని హరీశ్ చెప్పారు. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా రూ.5 లక్షల చేనేత బీమా పథకాన్ని ప్రకటించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఎనిమిది జిల్లాల్లో, వచ్చే ఏడాది మిగిలిన జిల్లాల్లో వైద్య కళాశాలలను ప్రారంభిస్తారు. ఇప్పటికే కొనసాగుతున్న అన్ని పథకాలకు తగిన నిధులను కేటాయించారు. ప్రధాన రంగాలన్నింటికీ లోటు లేకుండా నిధులను ప్రతిపాదించారు. ‘నీరా’ను సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమగా తీర్చిదిద్దడానికి 20 కోట్లు కేటాయించారు.
రెండు గంటల ప్రసంగం
శాసనసభలో హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం దాదాపు రెండు గంటలపాటు ప్రసంగం కొనసాగింది. సభ అనంతరం ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరుసటిరోజుకు సభను వాయిదావేశారు.
అడ్డు తగిలిన బీజేపీ.. కాంగ్రెస్ వాకౌట్
హరీశ్‌రావు ప్రసంగం మొదలుపెట్టగానే బీజేపీ సభ్యులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. బీజేపీ పక్ష నేత రాజాసింగ్ వెల్‌లోకి దూసుకెళ్లారు. బీజేపీ తీరుపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బీజేపీ సభ్యులను సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను సభ ఆమోదించడంతో స్పీకర్ బీజేపీ సభ్యులను సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు బడ్జెట్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
హరీశ్ ప్రసంగంపై హర్షాతిరేకాలు
బడ్జెట్ ప్రసంగం సమయంలో మంత్రి హరీశ్‌రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను వరుసబెట్టి వినిపించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ షేమ్ షేమ్ అంటూ బల్లలు చరిచారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆయా రంగాలకు నిధుల కేటాయింపులు తెలిపినప్పుడు, కొత్త పథకాలు ప్రకటించినప్పుడు సభ్యులు కేసీఆర్ జిందాబాద్ అంటూ అభినందనలు తెలియజేశారు.
పలకరింపులు.. కరచాలనాలు
సభ ప్రారంభానికి ముందే సమావేశ మందిరంలోకి వచ్చిన సభ్యులు ఒకరినొకరు పలకరించుకొని కరచాలనం చేసుకొన్నారు. మంత్రి కేటీఆర్‌తో కరచాలనానికి సభ్యులు పోటీపడ్డారు. సహచర సభ్యులను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ప్రతిపక్ష సభ్యులు కూర్చొనే వైపు వెళ్లిన కేటీఆర్.. బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్‌ను కలిసి కరచాలనంచేశారు.
15న ద్రవ్య వినిమయ బిల్లు
బీఏసీ సమావేశంలో నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీ అధ్యక్షతన సోమవారం విడివిడిగా జరిగిన బీఏసీ సమావేశాల్లోలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాసర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించా లన్నదానిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం జరగలేదు. ఈ నెల 8 తోపాటు 13న (ఆదివారం) శాసనసభ సమావేశాలకు సెలవు ప్రకటించారు. 9న శాసనసభ తిరిగి సమావేశమైన తర్వాత వార్షిక బడ్జెట్‌పై అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాలు, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 10, 11, 12, 14 తేదీల్లో బడ్జెట్ పద్దులపై శాఖలవారీగా చర్చ జరుగుతుంది. 15న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత విపక్షాలు కోరితే సమావేశాలను పొడిగించే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది.
మండలిలో 10న బడ్జెట్‌పై చర్చ
శాసనమండలి సమావేశ తేదీలు, ఎజెండాను ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ఖరారు చేసింది. ఈ నెల 8, 9, 13 తేదీల్లో మండలి సమావేశాలకు విరామాన్ని ప్రకటించింది. 10న బడ్జెట్‌పై చర్చించాలని నిర్ణయించింది. ఆ చర్చకు ఆర్థిక మంత్రి అదే రోజు సమాధానమిస్తారు.
10 బడ్జెట్లతో రామకృష్ణారావు రికార్డు
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అరుదైన రికార్డు సృష్టించారు. 10 బడ్జెట్లు ఆయన హయాంలోనే రూపుదిద్దుకోవడం గమనార్హం. సహజంగా ఒక శాఖలో అధికారులు 2, 3 ఏండ్లు పనిచేస్తేనే గొప్ప. ఆర్థికశాఖ అత్యంత క్లిష్టమైంది కూడా. ఒక్కసారి బడ్జెట్ రూపొందించడం, దానిని అమలు చేయడమే కష్టమని అధికారులు భావిస్తుంటారు. కానీ, ఏకంగా పదిసార్లు బడ్జెట్ రూపకల్పనలో ఆయన భాగస్వామి అయ్యారు. 2014 ఫిబ్రవరిలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వచ్చిన ఆయన గడిచిన 8 ఏండ్లలో 10 బడ్జెట్లలో భాగస్వామి అయ్యారు.
2,56,958 కోట్ల పద్దు
నిర్వహణకు 1,89,274,82 కోట్లు
ప్రగతి పద్దు 29,728.44 కోట్లు
ఏడేండ్లలో 1,59,035 కోట్ల పెరుగుదల
బడ్జెట్ పరిమాణంలో 161% వృద్ధి
ముఖ్యమైన కేటాయింపులు
వ్యవసాయ రంగం: 24,254 కోట్లు
దళితబంధు :17,700 కోట్లు
ఆసరా పెన్షను : 11,728 కోట్లు
మన ఊరు-మన బడి :7,289 కోట్లు
కల్యాణలక్ష్మి :2,750 కోట్లు
పల్లె ప్రగతి: 3,330 కోట్లు
పట్టణ ప్రగతి: 1,394 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్లు : 12 వేల కోట్లు
కేసీఆర్ కిట్లు : 443 కోట్లు
ఎస్టీల సంక్షేమం: 12,565 కోట్లు
ఎస్సీల అభివృద్ధి శాఖ : 20,625 కోట్లు
బీసీ సంక్షేమం : 5,698 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం : 177 కోట్లు
గుడులకు ధూపదీపం; 1,736
అటవీ వర్సిటీ : 100 కోట్లు
ఆర్టీసీకి : 1,500 కోట్లు
గొర్రెలు, మేకలు: 1,000 కోట్లు
మహిళా వర్సిటీ : 100 కోట్లు
హోంశాఖకు : 9,315 కోట్లు
కాళేశ్వర టూరిజం : 750 కోట్లు