Harish Rao | సిద్దిపేట : సిద్దిపేటలో బసవేశ్వరుని భవనంతో పాటు రుద్రభూమికి అవసరమైన స్థలం ఇస్తాం, బసవ కల్యాణ మండపం నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వీరశైవ బలిజ సమాజ మహాసభకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సభకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వీరశైవ బలిజ సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో మా ఓటు హరీశ్ రావుకే అంటూ వీరశైవ బలిజ సమాజం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలిజ సమాజాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కోటి రూపాయలతో హైదరాబాదు ట్యాంకు బండ్‌పై బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో బసవ భవనాల కోసం విలువైన స్థలం ఇచ్చామన్నారు.
లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం, కష్టం గురించి వివరించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు అని మంత్రి కొనియాడారు. బసవేశ్వరుని జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జిల్లాలో బలిజలు ఎక్కువ. మీతో అవినాభావ సంబంధమున్నదని పేర్కొన్నారు. బసవుడి పాలన గురించి మహారాష్ట్రకు స్వయంగా వెళ్లి తెలుసుకున్నానని తెలిపారు. సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టుకున్నామని హరీశ్‌రావు గుర్తు చేశారు.