సిద్దిపేట : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ కష్టపడి చదవాలి.. ఈ రెండు నెలల దించిన తల ఎత్తొద్దు.. అప్పుడే మీ జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టెట్‌కు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో టెట్ అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్, ఆవనిగడ్డ కంటే ఇక్కడ అద్భుతంగా కోచింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 2015లోనే కానిస్టేబుల్ ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాం. గతంలో టెట్‌కు ఉచిత కోచింగ్ ఇచ్చాం. వెయ్యి మంది కోచింగ్ తీసుకుంటే 800 మంది అర్హత సాధించారని గుర్తు చేశారు. మీరు ఉద్యోగం సాధించినప్పుడే ఈ శిబిరానికి సార్ధకత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ రెండు నెలలు మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఇప్పటి ఉద్యోగ నియామకంలో 95శాతం స్థానికులకే అవకాశం కల్పిస్తున్నాం. అన్ని జిల్లాల్లో సమానంగా ఖాళీలు ఉండేలా చొరవ చూపాం. అందరికీ అవకాశాలు వచ్చేలా చేశామన్నారు. మీలాంటి వారి కోసమే ఉద్యోగ బదిలీలలో ప్రతిపక్ష పార్టీ నాయకులతో పడరాని మాటలు పడ్డామని తెలిపారు. ఉద్యోగాలలో ఇంటర్వ్యూల పేరిట మోసం జరుగుతుందని, మెరిట్‌కే పట్టం కట్టాలని సీఎం ఆలోచన చేశారని మంత్రి పేర్కొన్నారు.