సిద్దిపేట : ఒకప్పుడు చుక్క నీరు లేని సిద్దిపేట ప్రాంతాన్ని రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చుకున్నం. నాలుగేళ్లుగా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల కోసం ప్రయత్నిస్తున్నాం. మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్స్ సిద్దిపేటకు తెచ్చుకున్నాం. సెప్టెంబర్ 13న బి ఫార్మసీ కళాశాల ప్రారంభించుకుంటాం. అన్ని రకాల చదువులు, ఆలయాలు, రిజర్వాయర్లకు ఖిల్లా అయిన సిద్దిపేటను చదువులకు సైతం నిలయంగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
బుధవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో రూ. 48 కోట్లతో చేపట్టిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. తెలంగాణ వచ్చాక నేడు 80 రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాక ముందు 682 మాత్రమే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ నేడు 1012 స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

గత ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించాలి. సద్దితిన్న రేవు తలవాలి. చదువుకుంటున్న విద్యార్థులు మీ పేరెంట్స్‌కు తెలపాలని సూచించారు. 2014 కు ముందు రెసిడెన్షియల్ విద్యపై పెట్టిన ఖర్చు రూ.970 కోట్లు, నేడు రూ.4000 కోట్లు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం.
ప్రభుత్వం పని ఎక్కువ చేస్తున్నది, చెప్పుకునేది తక్కువ ఉన్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు పంజాబ్ వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంటే నేడు తెలంగాణ నెంబర్ వన్‌గా మారిందని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ మనమీద ప్రేమ ఉండదు కానీ, మొన్న చంద్రబాబు తెలంగాణ భూములపై పాజిటివ్‌గా మాట్లాడారు.
ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కైకిలు లేని రోజుల నుంచి, నేడు కైకిలోల్లు దొరకని పరిస్తితి వచ్చిందని తెలిపారు. నిజాలు ప్రజలకు తెలియాలి. ఇంత మంచి ప్రభుత్వాన్ని.. చేసిన సేవలను గుర్తించి మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.