సిద్దిపేట, జూలై 24: ‘నడుస్తూ చెత్తను ఏరివేద్దాం.. చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛ సిద్దిపేటగా మారుద్దాం’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో ఉదయం 6 నుంచి 8 వరకు వార్డులోని అన్ని వీధులగుండా తిరుగుతూ మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలిగించారు. చెత్తను సంచుల్లోకి ఎత్తి ‘స్వచ్ఛ సిద్దిపేట’ కార్యక్రమంలో పౌరులంతా భాగస్వాములు కావాలని.. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. చెత్తరహిత ఆరోగ్య సిద్దిపేటను నిర్మిద్దామని చెప్పారు. చెత్త కుండీలు లేని పట్టణంగా సిద్దిపేటను మార్చుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అక్కడక్కడా పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి తొలిగించారు. సిద్దిపేట మున్సిపాలిటీ.. ‘నడుస్తూ చెత్త ఏరివేత’ కార్యక్రమాన్ని చేపట్టి మరో సంస్కరణకు శ్రీకారం చుట్టిందని మంత్రి పేర్కొన్నారు.