మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం రాత్రి ఓ మహిళకు సాధారణ ప్రసవం జరిగిందని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న మంత్రి.. హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా పీహెచ్సీని సందర్శించారు.
తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇతర పేషెంట్లను పలుకరించారు. దవాఖానలో అందుతున్న సేవల పట్ల ఆరా తీశారు. హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు. ఆదివారం కూడా సిబ్బంది హాజరై పూర్తి సేవలు అందిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన మందులు అందిస్తున్నామని, ప్రసవం అయిన తర్వాత తల్లులకు కేసీఆర్ కిట్ ఇస్తున్నామని సిబ్బంది మంత్రికి తెలిపారు.