హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 25: వైద్య రంగంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపా రు. ఈ క్రమంలో ముందుచూపుతో 2015 లోనే సీఎం కేసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్)కు 45 ఎకరాల స్థలం, రూ.10 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు. రాజేంద్రనగర్‌లో నూతనంగా నిర్మించిన ఐఐపీహెచ్ భవన సముదాయాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు.
ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. అప్పట్లో కరోనా వంటివి లేకున్నా సీఎం కేసీఆర్ ఇలాంటి ఇన్స్టిట్యూట్ల ఆవశ్యకతను గుర్తించి స్థలం, నిధు లు కేటాయించారని చెప్పారు. వైద్యారోగ్యం లో కేంద్రం, నీతిఆయోగ్ రాష్ర్టాలకు ర్యాంకు లు ఇస్తే.. అత్యుత్తమంగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. మన దగ్గర నిష్ణాతులైన వైద్యులు, ఆరోగ్య వ్యవస్థ ఉన్నా.. ప్రజారోగ్య వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని అన్నారు. అందుకే రాష్ట్రంలోని 630 పీహెచ్‌సీల్లో దవాఖానకు ఒకరు చొప్పున పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ వ్యక్తిని నియమించాలని నిర్ణయించినట్టు వివరించారు.
అంతేకాదు ఒక ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని వెల్లడించారు. ప్రైమరీ హెల్త్ కేర్‌ను అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానలు తీసుకొచ్చామని తెలిపారు. హెల్త్ బడ్జెట్ గతంలో రూ.6,300 కోట్లు ఉండగా, ఈ ఏడాది దాన్ని రూ.11,440 కోట్లను పెంచామని అన్నారు. కేంద్రం తన బడ్జెట్లో ఆరోగ్యానికి 1.1 శాత మే కేటాయించగా, తెలంగాణ మాత్రం 4.5 శాతం కేటాయించినట్టు వివరించారు. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి ప్రభుత్వ కాలేజీల్లోనే 1,650 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో 33 జిల్లా ల్లో 33 మెడికల్ కాలేజీలు, అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకొంటున్నామని వివరించారు.
దీర్ఘకాలిక వ్యాధులకు సూపర్ స్పెషాలిటీలు
ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయని, వీటి కోసం సూపర్ స్పెషాలిటీ దవాఖాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంత్రి హరీశ్ తెలిపారు. వరంగల్, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను అందుబాటులోకి తేనున్నామని వెల్లడించారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఐఐపీహెచ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇందుకోసం ప్రిన్సిపల్ సెక్రటరీని ఐఐపీహెచ్ బోర్డులో సభ్యుడిగా చేరుస్తామని చెప్పా రు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వెంట నే జారీ చేస్తామని స్పష్టం చేశారు.
ఐఐపీహెచ్.. యూనివర్సిటీగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపితే, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థకు ఇప్పటికే రూ.5 కోట్లు మం జూరు చేశామని, మిగిలిన నిధులను కూడా త్వరలో మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఐఐపీహెచ్ అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీది ట్రబుల్ ఇంజిన్
నారాయణరావుపేట, ఆగస్టు 25: డబు ల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమ ని బీజేపీ గొప్పలు చెప్పుకుంటున్నదని, వాస్తవానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో వెనుకబడి ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో గురువారం ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణరావుపేటలో హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ వృద్ధులకు రూ.2016 పెన్షన్ ఇవ్వడం లేదని తెలిపారు. కొత్త పెన్షన్లు దసరా పండుగ ముందు ఇస్తామని చెప్పి మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకొన్నదని చెప్పారు. కులం, మతం అన్న తేడా లేకుండా ఇంటికి పెద్దకొడుకులా సీఎం కేసీఆర్అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ సర్కారుకు ఆస్తులు అమ్మడం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని హరీశ్‌రావు విమర్శించారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే బీజేపీ పని అని విమర్శించారు.