సిద్దిపేట/హుస్నాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ గడ్డ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో మనకు 88 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. మళ్లీ హుస్నాబాద్ గడ్డ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సారి 100 స్థానాలను సాధిస్తాం’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఎల్లమ్మ తల్లి దయతో తప్పకుండా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను చూసి తెలంగాణ ప్రజల హృదయాలు ఉప్పొంగిపోతుంటే.. ప్రతిపక్షాల గుండెలు మాత్రం వణికిపోతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఏ మాట ఇచ్చినా తప్పకుండా దానిని అమలు చేస్తారనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హుస్నాబాద్ కరువు ప్రాంతమని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో పచ్చటి పొలాలతో అలరారుతున్నదని పేర్కొన్నారు. సతీశ్‌కుమార్ సౌమ్యుడు, ప్రజల మనిషి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే మచ్చలేని నాయకుడని మంత్రి చెప్పారు. ఇక్కడ సతీశ్‌కుమార్‌కు, అక్కడ సీఎం కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయం అందించే విధంగా ప్రజల తీర్పు ఉండాలని కోరారు.
చెప్పింది చేయడంతోపాటు చెప్పనిది కూడా చేసి చూపించడం బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ విధానమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో చెప్పని రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాల అమలే అందుకు నిదర్శనమని చెప్పారు. అభివృద్ధిని కొనసాగించాలంటే మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
2014కు ముందు కరువు, కాటకాలతో ఉన్న హుస్నాబాద్.. నేడు సీఎం కేసీఆర్ కృషి తో సస్యశ్యామలంగా మారిందని బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్ చెప్పారు. హు స్నాబాద్‌కు ఏది అడిగినా కేసీఆర్ కాదనకుం డా ఇచ్చిన గొప్ప నేతలని కొనియాడారు.