నాడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. ఇవాళ కేంద్రం హోదాను ఎగబెట్టినా ఏపీలోని అధికార పక్షం అడగదు.. ప్రతిపక్షం ప్రశ్నించదు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ, వైసీపీ పాకులాడుతున్నాయి. అక్కడి పార్టీలు ప్రజలను గాలికి వదిలేశాయి. తమ స్వార్థం కోసమే పనిచేస్తున్నాయి
-మంత్రి హరీశ్‌రావు
Harish rao | సంగారెడ్డి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రా మంత్రులు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడకపోతేనే మంచిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ‘మా జోలికి రావద్దు. మా గురించి ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిది కాదు’ అని సున్నితంగా హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అందోల్‌లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణకు మించిన మాడల్ లేదని స్పష్టంచేశారు.
తెలంగాణలో ఏమున్నది అన్న ఆంధ్రా మంత్రుల వ్యాఖ్యలను హరీశ్‌రావు తిప్పికొట్టారు. ‘సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రాకు చెందిన తాపీ మేస్త్రీలతో యథాలాపంగా, మాట వరుసకు.. ఆంధ్రా, తెలంగాణలో మీకు రెండు చోట్ల ఓటు ఎందుకు.. ఇక్కడే ఉండండి అని చెప్పాను. దీనిపై ఆంధ్రాకు చెందిన కొందరు మంత్రులు ఎగిరిపడుతున్నారు. ఏదేదో మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. మీ తెలంగాణలో ఏమున్నదని ఓ ఆంధ్రా మంత్రి ప్రశ్నించారు. మీరు తెలంగాణకు వచ్చి చూడండి.. మా దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి వరి పంట ఉన్నది. ఆడపిల్ల పెండ్లికి రూ.లక్ష ఇచ్చే కల్యాణలక్ష్మి పథకం ఉన్నది. మా బోరుబావి కాడ 24 గంటల కరెంటు వస్తున్నది. గర్భిణులు, బాలింతలకు కేసీఆర్ కిట్ పథకం ఉన్నది. ఎకరాకు రైతుకు ప్రతి సంవత్సరం పెట్టుబడి కోసం రూ.10 వేలు ఇచ్చే రైతుబంధు పథకం ఉన్నది. రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే రూ.5 లక్షలు వారం రోజుల్లోగా రైతు ఇంటికి పంపించే రైతుబీమా పథకం ఉన్నది.. మా దగ్గర 26 మెడికల్ కాలేజీలున్నాయి. మెడికల్ కాలేజీల ద్వారా పిల్లలకు వైద్య విద్య, పేదలకు వైద్య సేవలు అందజేస్తున్న ప్రభుత్వం ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ఉన్నది. ఇలా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నవి దునియా చెప్పగలుగుతాం. మరి మీ దగ్గర ఏమున్నది?’ అని ఆంధ్రా మంత్రిని ప్రశ్నించారు. ‘నాడు మీరు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఎగబెట్టినా ఎవరూ కనీసం నోరు మెదపడం లేదెందుకు? విశాఖ ఉక్కును తుక్కుకు అమ్మినా, ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అధికార పక్షం అడగదు.. ప్రతిపక్షం ప్రశ్నించదు. ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ ప్రత్యేక హోదా కోసం నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నది. అక్కడ అన్ని పార్టీలు ప్రజలను గాలికి వదిలేశాయి. అధికార, ప్రతిపక్షం రెండూ స్వార్థం కోసం పనిచేస్తున్నాయి’ అని విమర్శించారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘జోగిపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం అందోల్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ నన్ను కలిసి, సర్.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలి.. సీఎం కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పాడు. తనకు ఉన్న ఎనిమిది ఎకరాల పొలంలో ఉచిత కరెంటుతో రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయని ఆయన చెప్పిన మాటలు నా కడుపు నింపాయి’ అని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని.. అందుకే ప్రజలంతా తిరిగి సీఎం కేసీఆర్ పాలన కోరుకొంటున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు సింగూరు జలాలను సంగారెడ్డి సాగు, తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు జైపాల్‌రెడ్డి, మఠం భిక్షపతి పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు జోగిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, బస్తీ దవాఖానతోపాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలోని జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అందోల్ జర్నలిస్టులకు బుధవారం ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రూ.100 కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల అక్రెడిటేషన్ కార్డులుంటే, నేడు 21,295 కార్డులు జారీచేశామని చెప్పారు. జర్నలిస్టులు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గుర్తించాలని కోరారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేతలు మారుతి సాగర్ పాల్గొన్నారు.