మూడు నల్ల చట్టాలు తెచ్చి వెయ్యి మంది రైతుల చావుకు కారణమై బీజేపీ చేసింది పాపం. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ దేశానికి శాపం. నిరంతర కరెంటు ఇస్తూ రైతులను ఆదుకొంటున్న సీఎం కేసీఆరే మనకు దీపం. ఇంటి దీపం కావాలో.. శాపం, పాపం కావాలో ప్రజలే తేల్చుకోవాలి.
– మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్, జూలై 29: ‘మా తెలంగాణకు నిధులివ్వాలని, మా పైసలు చిత్తూరు జిల్లాకు తీసుకపోతున్నవని అసెంబ్లీలో బల్లగుద్ది ఎమ్మెల్యేగా నేనున్నప్పుడు అడిగితే ఒక్క రూపాయి ఇవ్వనని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి గరువు.. ఉచిత కరెంట్ సాధ్యంకాదని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి గురువు’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి శిష్యుడు కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. వీళ్లను నమ్మితే మళ్లీ ఆగమవుతామని హెచ్చరించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
గజ్వేల్ ఐవోసీ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎమ్మారెఫ్ చెక్కులు, ధూపదీప నైవేద్యం ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణకు రూపాయి ఇవ్వను, రాష్ట్రం ఏర్పాటు కానివ్వనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాళ్ల వద్ద తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తున్నదని, తెలంగాణను రాచి రంపాన పెట్టి కరెంట్, తాగునీళ్లు ఇవ్వని చంద్రబాబు వద్ద కుదవపెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నదని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి బీజేపీ ఢిల్లీలో వెయ్యి మంది రైతుల చావుకు కారణమైందని ఆరోపించారు. 24 గంటల కరెంట్ కావా లా.. వద్దా? అంటూ రైతులను అడగగా కావాలి… కావాలి అంటూ ముక్తకంఠంతో నినదించారు. మూడు గంటల కరెంట్ కావాలంటున్న కాంగ్రెస్‌కు ఓటేద్దామా.. మూడు పంటలు కావాలంటున్న కేసీఆర్‌ను కడుపులో పెట్టి చూసుకుందామా ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్రంపై కాంగ్రెస్, బీజేపీలది కక్షే అని, సీఎం కేసీఆరే తెలంగాణకు రక్ష అని పేర్కొన్నా రు. ఎవరు రాష్ట్ర ప్రజాసంక్షేమంపై ముందు చూపు తో వ్యవహరిస్తున్నరో మీరే ఆలోచించాలని కోరారు.
ఏ హామీ ఇచ్చినా దేశమంతా అమలు చేయాలి
పిల్లిని సంకన పెట్టుకున్నట్టు తెలంగాణ ద్రోహులైన మాజీ సీఎంలను రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు మో స్తున్నారని మంత్రి హరీశ్‌రావు మం డిపడ్డారు. కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా రావడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నది ఆం ధ్రా నాయకుల చెప్పులు మోయడానికా? తెలంగాణ సమాజానికి ఏమీ సందేశం ఇవ్వదల్చుకున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలను హరీశ్‌రావు నిలదీశారు. తెలంగాణలో బీజేపీ ఏ హామీ ఇచ్చినా వాటిని కేంద్రంలోనూ అమలు చేయాలని, కాం గ్రెస్ ఇచ్చే ప్రతి హామీని మొదట ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో అమలుచేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు జాతికోసం తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. శ్రావణ మాసంలో గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన వారందరికీ ఇండ్ల మంజూరు చేస్తామని చెప్పారు. మరోసారి కేసీఆర్‌ను దీవిం చి ఆశీర్వాదించాలని కోరారు. తొలుత హోంమంత్రి మహమూద్ అలీలో కలిసి మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో ఏసీపీ కార్యాలయం, ములుగు, కుకునూరుపల్లిలో పోలీస్స్టేషన్లు, వర్గల్ లో సీఐ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి,ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాబు ప్రోద్బలంతోనే రేవంత్ కుట్రలు
2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే చం ద్రబాబు ప్రోద్బలంతోనే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలను కొని పసిగుడ్డులాంటి ప్రభుత్వాన్ని చంపాలని చూశాడని, బీజేపీ వాళ్లు కూడా ఎమ్మెల్యేలను కొనాలని అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు. తెలంగాణను అస్థిరపర్చేందుకు ద్రోహులు అవకాశం కోసం ఎదు రు చూస్తున్నారని, అన్ని సమయాల్లో మనకు అండగా ఉన్న సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సమయంలో మనం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సద్ది తిన్న రేవు తలవాలని, సీఎం కేసీఆర్‌ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు.
మంత్రి హరీశ్‌రావు కామెంట్స్