సిద్దిపేట : దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామంలోని 129 మంది దళిత బంధు లబ్దిదారులకు మంజూరు పత్రాలు, యూనిట్లను హరీశ్‌రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజున దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒక పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 లక్షల నగదు బదిలీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నేటి నుంచి దళితబంధు యూనిట్ల ద్వారా లబ్ధిదారులు సంపాదించుకునే ప్రతి పైసా వారిదేనని స్పష్టం చేశారు. దళితులు వ్యాపార వృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడాలని కోరారు. విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్‌లు, కాంట్రాక్ట్‌లలో సైతం దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ చేపడుతున్న పథకాలు, విధాన నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు.
కొల్గూర్ గ్రామంలో ఫంక్షన్ హాల్, డైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రజక భవనం, సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు తదితర పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ గ్రామంలో సొంత జాగలో ఇండ్లను నిర్మించుకునేలా 200 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తాం. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.