హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటికే కేంద్రం 4 లక్షల 6 వేల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం ఒత్తిడి చేస్తున్నదని చెప్పారు. ఆదివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రజల సమ్మిళిత అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ద్రవ్య వినియమ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు టీ జీవన్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి పలు అంశాలను లేవనెత్తారు. సభ్యుల సందేహాలకు హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని తూర్పారబట్టారు. రైళ్లు, విమానాలు, పోర్టులు, రైల్వేస్టేషన్లు కార్పొరేట్ల పరం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్ఐసీని ప్రైవేటీకరించాలని చూస్తున్నారని విమర్శించారు. జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ర్టానికి 13 శాతం వాటా ఉన్నదని, దీని విలువ రూ.1,000 కోట్లు అని చెప్పారు. దీన్ని విక్రయిస్తే రాష్ర్టానికి రూ.500 కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం లేఖ రాసిందని, ఆ ఆఫర్‌ను సీఎం కేసీఆర్ నిర్దంద్వంగా తిరస్కరించారని వెల్లడించారు.
మోదీ పాలనలో కంటే, యూపీఏ ప్రభుత్వ హాయాంలోనే వార్షిక వృద్ధిరేటు బాగున్నదని చెప్పారు. 2013-14లో 6.8 వార్షిక వృద్ధి రేటు ఉంటే, బీజేపీ హయాంలో 2014-23 వరకు 5.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ తొమ్మిదేండ్ల పాలనలో తలసరి ఆదాయం 12.73 శాతం ఉంటే, మోదీ తొమ్మిదేండ్ల పాలనలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 7.01% అని చెప్పారు.
విద్యుత్తు సంస్కరణలు అని అందమైన పేరు పెట్టి సింగరేణిని విక్రయించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి దేశంలోనే అధికంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి ఎమ్మెల్యేకు ఏటా ఏసీడీపీ నిధులు రూ.3 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో ఎఫ్ఆర్బీఎం రూ.15 వేల కోట్లు, 15వ ఫైనాన్స్ నుంచి రూ.6,386 కోట్లు, ఏపీ నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.18,236 కోట్లు, రాష్ట్రం ఖాతాలో వేయాల్సిన రూ.495 కోట్లు ఏపీ అకౌంట్లో వేశారని, ఈ నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కొన్ని పార్టీల నాయకులు భవనాలను కూల్చేస్తాం, పేల్చేస్తామని మాట్లాడుతున్నారని, ఇలాంటి చర్యలను ప్రజలు సహించరని హెచ్చరించారు.