తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేదపండితులు మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి శేష పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మూడోసారి సీఎంగా కేసీఆర్ అవుతారన్నారు. టీటీడీ సహకారంతో కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో మూడో సారి కూడా ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టబోతున్నారని మంత్రి స్పష్టం చేశారు.