కరీంనగర్ : పేదలకు మెరుగైన సేవలే లక్ష్యంగా వైద్యులు పని చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని నెహ్రూ చౌరస్తా సమీపంలో జనరల్ ఫిజీషియన్ మౌనికారెడ్డి, రేడియాలజిస్ట్ నరేందర్‌రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎన్ఆర్ ఆసుపత్రిని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కరీంనగర్ వైద్యరంగంలో ఎంతో ముందుకు వెళ్లిందని, స్మార్ట్ వైద్యానికి కేంద్ర బింధువుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. గతంలో గుండె, కిడ్నీ, ఇతరత్రా జబ్బులు వస్తే హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం కరీంనగర్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉందన్నారు.
కరీంనగర్‌తో పాటు చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు అభినందనీయులన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల సైతం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వైద్యులు సేవాభావంతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, రాబోయే రోజుల్లో వైద్యం అంటే కరీంనగర్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, మేచినేని వనజ, మెండి, శ్రీలత, ఆసుపత్రి నిర్వాహకులు అభిలాష్‌రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.