కరీంనగర్ : రాష్ట్రంలోని అన్ని కులాలు ఆత్మగౌరవం(Self-respect)తో బతకాలనే సంకల్పంతో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని 14వ డివిజన్ సప్తగిరి కాలనీలో గౌడ , రజక, మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణాలకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) ప్రతి ఒక కులానికి ప్రభుత్వ భూమితో పాటు భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు , గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను, ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం(Telangana government) ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు కేటాయించారని అన్నారు. నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని అన్నారు.
కరీంనగర్ ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దానిలో భాగంగా మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టునలు సీఎం ఇచ్చారని తెలిపారు. మానే రివర్ ఫ్రంట్ పనులను ఆగస్టు 15 వరకు పూర్తి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్ తోట రాములు, గుగ్గిల్ల జయశ్రీ, గందె మాధవి, మహేశ్ ఐలేందర్ యాదవ్, బండారు వేణు, భూమా గౌడ్ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.