హైదరాబాద్ : రాష్ట్రంలో తడిసిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు ఎదురవుతున్న ఎఫ్సీఐ(FCI) ఎఫ్ఏక్యూ నిబంధనలు సవరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) కేంద్రాన్ని మరోసారి కోరారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర మిల్లర్ల సంఘం ప్రతినిధులు, సివిల్ సప్లైస్ శాఖ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఖమ్మం, నిజామాబాద్ లలో ధాన్యం అన్లోడింగ్ ఇబ్బందులను పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని సమన్వయ పరుచుకుని సేకరణ వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తడిచిన ధాన్యం(Wet Grain) మిల్లింగుకు పనికిరాకుండా పాడవుతుందని, నూక శాతం పెరగడంతో పాటు రంగుమారుతుందని మిల్లర్లు మంత్రికి వివరించారు. దీనిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదించకపోవడంతో నష్టం జరుగుతుందన్నారు.
మంత్రి గంగుల స్పందిస్తూ ఇప్పటికే కనీస నాణ్యతా ప్రమాణాలను సడలించాలని ఎఫ్సీఐకు లేఖ రాసామని, మరోసారి దీనిని ఆమోదించవలసిందిగా కేంద్రానికి విజ్ణప్తి చేశారు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తుందన్నారు. , వర్షాలు కురుస్తున్నప్పటికీ రోజుకు లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామని వెల్లడించారు.
సోమవారం లక్షా 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డు స్థాయిలో సేకరించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 15.38లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. ఈ సమీక్షలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ వి.అనిల్ కుమార్, రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షులు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, ఇతర మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.