హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలకులు బీసీలను వెనుకకు నెట్టివేశారని , సీఎం కేసీఆర్ (CM KCR) పదేళ్ల పాలనలో బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar ) అన్నారు. ఆదివారం కోకాపేట్లో రెండు ఎకరాల్లో రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న పెరిక కుల సంఘం ఆత్మగౌర భవనానికి, పిర్జాదిగూడలో రూ.కోటితో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆత్మ గౌరవ భవనానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas) , మల్లారెడ్డి (Mallareddy) తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కోకాపేట (Kokapeta) లో నిర్వహించిన సభలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. నాటి పాలనలో సంఘాల భవనాల కోసం ప్రభుత్వానికి కోరితే పట్టించుకోలేదని ఆరోపించారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ విలువైన స్థలాల్లో బీసీల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలే కాకుండా వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.
సమాఖ్య పాలనలో బీసీలకు కేవలం 19 గురుకులాల్లో 7,500 మంది విద్యార్థులు మాత్రమే చదివే అవకాశముండగా నేడు స్వయం పాలనో 327 గురుకులాల్లో 1,80,000 మంది బీసీ బిడ్డలు అత్యున్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి (Kalyanalaxmi) , షాదీ ముబారక్(Shadi Mubarak) ద్వారా రూ . లక్ష రూపాయలను అందిస్తున్నారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ , మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పెరిక సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడ కుంటి వెంకటేశ్వర్లు, పెరికకుల సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య, నాయకులు ఘటిక విజయ్, జిల్లాల అధ్యక్షులు పెరిక కులస్తులు పాల్గొన్నారు.