Congress | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ‘ఫిరాయింపుల మంత్రిత్వశాఖ’ ఏర్పాటు చేసి, దాని బాధ్యతలను ప్రత్యేకంగా ఒక మంత్రికి అప్పగించారంటూ రాజకీయ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు దానం నాగేందర్‌తో మొదలైన ఫిరాయింపుల ప్రక్రియ తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్ వరకు కొనసాగింది. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని కాంగ్రెస్ బాహాటంగానే చెప్తున్నారు.
ఈ వ్యవహారం మొత్తాన్ని ఒక మంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే రెండు కీలక శాఖలు నిర్వహిస్తున్న ఆ మంత్రికి.. అదనంగా ఫిరాయింపుల శాఖ కూడా అప్పగించారని సచివాలయంలో, కాంగ్రెస్ పార్టీలో సెటైర్లు వేస్తున్నారు. ఆయన చేతిలోని అత్యంత కీలకమైన శాఖను ఉన్నతాధికారులకు వదిలేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆ శాఖపై అటు సీఎం, ఇటు ఉన్నతాధికారులే మాట్లాడుతున్నారని మంత్రి పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు వాపోతున్నాయి. మంత్రిని కలిసి విన్నవించినా ఫలితం ఉండటం లేదని సదరు శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. మంత్రికి ‘ ఫిరాయింపుల శాఖ అదనపు’ బాధ్యతలు పెరగడమే ఇందుకు కారణమని సెటైర్లు వేస్తున్నారు.