అసలేంటీ భూముల కథ?
ప్రభుత్వం పేదలకు అసైన్ చేసిన భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నవి, దేవాదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్, అర్బన్ సీలింగ్ భూములు, సివిల్ కోర్టులు అటాచ్ చేసినవి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ, ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ శాఖలు తమ బకాయిల కింద ఆధీనంలో పెట్టుకున్న భూములను 22ఏ సెక్షన్ కింద చేర్చారు. ఈ భూముల క్రయ, విక్రయాలు నేరం.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): 22ఏ జాబితాకెక్కిన భూములపై ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కన్ను పడినట్టు తెలిసింది. పలు కారణాలతో ఈ జాబితాలోకి ఎక్కిన భూములను అందులోంచి తప్పించి వాటికి ప్రైవేటుగా పట్టాలు ఇవ్వడంపై ఆయన మంత్రాంగం చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి ఈ భూములపై నిషేధం ఉంది. వీటి క్రయవిక్రయాలు నేరం కూడా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో దాదాపు 5 వేల ఎకరాలకు సంబంధించి 2,700 వినతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ మంత్రి తన కుమారుడితో కలిసి సెటిల్మెంట్లకు కౌంటర్ తెరిచినట్టు తెలిసింది.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 5 ఎకరాలు ఒక చోట, 25 ఎకరాలు మరో చోట, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో100, అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో 100 ఎకరాలు 22ఏ కింద ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఆ జాబితా నుంచి తప్పించి, ప్రైవేటు పట్టాలు ఇచ్చేందుకు 50 శాతం భూ వాటాతో ఒప్పందం కుదిరినట్టు ‘నమస్తే తెలంగాణకు’ పక్కా సమాచారం అందింది. 2007లో 22ఏ రిజిస్ట్రేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. పట్టా భూములకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. ఇలా వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 22ఏ రిజిస్ట్రేషన్ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. 22ఏ జాబితాను రూపొందించే క్రమంలో జరిగిన పొరపాట్ల కారణంగా అక్కడక్కడ పట్టా భూములు కూడా ఆ జాబితాలోనే చేరాయి.
ఒకే సర్వే నంబరులో పట్టా భూమి, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు ఆ సర్వే నంబరు మొత్తం రిజిస్ట్రేషన్ నిషేధ జాబితాలోకి వెళ్లిపోయింది. సెటిల్మెంట్ రికార్డు ఆధారంగా సేత్వార్, ఖాస్రా పహాణి, చేసాల పహాణి పరిశీలించి ఈ భూముల్లో పట్టా ఏది? ప్రభుత్వ భూమి ఏది నిర్ధారించి వేరు పరిచే అధికారం రెవెన్యూ శాఖకు ఉంది. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూముల నిర్దిష్ట గడువు ముగిసిన అనంతరం అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఇటువంటి భూముల మీదపైనే కీలక మంత్రి కన్నేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 22ఏ కింద ఉన్న భూముల జాబితాను తెప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత ఎక్కువగా డిమాండ్ ఉన్న కొండాపూర్, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్, పటాన్చెరు ప్రాంతంలోని భూముల మీద మంత్రి కన్నేసి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ఐదు రకాల నిషేధిత భూముల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, ప్రభుత్వపరంగా చెడ్డపేరు లేకుండా 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి అనువైన భూములను గుర్తించడానికి రెవెన్యూ శాఖ మీద పట్టున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. ఇటువంటి భూములను గుర్తించి, సంబంధిత భూ యజమానులతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం సదరు కీలక మంత్రి కొడుకు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని నడిపిస్తున్నట్టు చెప్తున్నారు. నిషేధిత జాబితా నుంచి తమ భూమిని తప్పించాలని పెట్టుకున్న వినతి పత్రాల నుంచి ఆయా భూ యజమానుల వివరాలు, వారి ఇంటి చిరునామాను గుర్తించి బేరసారాలకు పిలుస్తున్నట్టు తెలిసింది.
ఇటీవల కాలంలో కొండాపూర్ నుంచి మియాపూర్ వెళ్లే దారిలోని ప్రైమ్ లొకేషన్లో వక్ఫ్ ఇనాంకు సంబంధించిన 5 ఎకరాల భూమిని 50 శాతం భూ వాటాతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ భూమి ప్రభుత్వ, పట్టా పంచాయతీతో 14 ఏళ్లుగా 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉంది. ఈ భూమికి సంబంధించి ఆరుగురు యజమానులు ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక మంత్రి వారిని పిలిపించి మాట్లాడి డీల్ సెటిల్ చేసినట్టు తెలిసింది. మంత్రి కొడుకు 50 శాతా వాటాతో ఒప్పందం చేసుకొని, ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించినట్టు సమాచారం. మొత్తం ఐదు అంతస్థుల భవన నిర్మాణాలు చేయాలని, వీటిలో గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ స్పేస్‌గా, మిగిలిన ఫోర్లు రెసిడెయన్షియల్ ఫ్లాట్లుగా నిర్మాణం చేయాలని ఒప్పందం జరిగినట్టు తెలిసింది. అదే చోట వారసత్వ వక్ఫ్ ఇనాంగా ఉన్న 25 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఇదే తరహా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో ఓఆర్ఆర్కు అతి సమీపంలోనే 100 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య దాదాపు 20 ఏండ్ల నుంచీ పంచాయితీ నడుస్తున్నది. జిల్లా కోర్టులు, హైకోర్టుల్లోనూ కేసులు నడుస్తున్నాయి. ఈ భూమికి దాదాపు 15 మంది రైతులు యాజమానులుగా ఉన్నారు. వీరిలో కొందరిని మంత్రి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. 50 శాతం వాటాతో 100 ఎకరాలను 22ఏ నుంచి తప్పించే విధంగా ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఇదే జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 30లో ఉన్న 400 ఎకరాలను దశల వారీగా 22ఏ నుంచి తప్పించి, ప్రైవేటు పట్టాలు ఇప్పించే ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
ఈ భూమిలో 100 ఎకరాలను ప్రైవేటు పట్టా సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ‘నమస్తే తెలంగాణ’ వద్ద పక్కా సమాచారం ఉంది. కీలక మంత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగే ఆర్సీపురం మండల కేంద్రంలోని గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి రంగంలోకి దిగారు. 100 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకొని దాని చుట్టూ రేకులతో పెన్సింగ్ వేశారు. దీనికి విద్యుత్తుశాఖ అధికారులు అగమేఘాల మీద కరెంటు స్తంభాలు వేసి ఎల్టీ లైన్ వేశారు.
మూడు బుల్డోజర్లు పెట్టి రాత్రింబవళ్లు గుట్టలను చదును చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. డిటోనేటర్లు పెట్టి రాత్రికి రాత్రి గుట్టలను పేల్చి వేస్తున్నా పోలీసులు చెవులు మూసుకున్నారు. పెద్ద పెద్ద గుట్టలను పూర్తిగా తొలిచేసి చదును చేశారు. మట్టి రోడ్లు పోశారు. గదులు నిర్మించారు. దీన్ని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వెలుగులోకి తెచ్చిన రోజు రెవెన్యూ అధికారులు కొద్దిసేపు హడావుడి చేశారు. ఫెన్సింగ్ కూలగొట్టినట్టు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ అక్కడ పనులు కొనసాగుతున్నట్టు సమాచారం.