పాలకుర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉందో.. అంతకుముందు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. నియోజకవర్గ ప్లీనరీలో చేసే తీర్మానాలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. దేశంలో ఏ శాఖకు రానన్ని అవార్డులు, ఏ మంత్రి సాధించనన్ని అవార్డులు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు రావడం గర్వకారణమని మంత్రి చెప్పారు.
మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన దేవరుప్పులలో పాలకుర్తి నియోజకవర్గ BRS పార్టీ ప్రతినిధుల మహా సభ జరిగింది. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన BRS పార్టీ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. సమావేశానికి ముందు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సభలో మంత్రితోపాటు పార్టీ ప్రతినిధులు అమర వీరులకు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత తెలంగాణ సర్కారు పనితీరు గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధికి, తెలంగాణలో జరిగిన అభివృద్ధికిగల తేడాపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి నిప్పులు చెరిగారు. ‘బండి సంజయ్ నీకు సిగ్గుందా..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నష్టపరిహారం 20 వేలు ఇస్తున్నారా..? ఇక్కడ ఎలా అడుగుతున్నారు..? ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న దేవుడు కేసీఆర్. నీకు సిగ్గుంటే, దమ్ముంటే కేంద్రం నుంచి మరో పదివేలు ఇప్పించాలి’ అని ఎర్రబెల్లి మండిపడ్డారు.
అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ‘గులాబీ సైనికులంతా ఒకే కుటుంబం. మనమంతా కలిసి మెలసి ఉందాం. మనపై మాటల దాడి చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ల కుట్రలను తిప్పి కొడదాం. మన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో, పాలకుర్తి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రపంచానికి చాటుదాం. మన ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని తిప్పి కొడదాం. కేంద్రంలో అబ్ కీ బార్ కేసీఆర్ సర్కార్ నినాదాన్ని నిజం చేస్తూ, దేశానికి మన కేసీఆర్‌ను ఇద్దాం. గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్‌ను దేశానికి ఇద్దాం’ అన్నారు.