జనగామ, సెప్టెంబర్ 29 : ఉమ్మడి పాలనలో గిరిజన తండాల్లో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడేవారు. నేడు అవే తండాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గిర్ని తండ, మైదం చెరువు తండ, చెరువు ముందు తండ, నీలిబండ తండా, బొడోని కుంట తండ, రామేశ్వరం, కడగుట్ట తండ, హక్య తండాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు.
మండలంలో తండా బాట నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యాక తండాల తండ్లాట తప్పించారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చారు. వారి తండాల్లో వారి రాజ్యాన్ని తెచ్చారని పేర్కొన్నారు. దీంతో మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్ది పోయే బాధ తప్పిందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చేది లేదు. ఇచ్చేది లేదు అన్నారు.
3 గంటల కరెంటు కావాలా? 3 పంటల కరెంటు కావాలా? అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కష్టాలు తప్పవన్నారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సుహాసిని, సంబంధిత శాఖల అధికారులు, ఆయా తండాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంతకు ముందు దేవరుప్పుల మండలం, దేవుని గుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ధరావత్ తండా, బానోతు తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి ఎర్రబెల్లి