పబ్బులు, క్లబ్బుల్లో తిరిగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు.ఈ నెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హనుమకొండ నయీంనగర్‌లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్‌ను గురువారం ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు.
యూపీఏ పాలనలో దేశంలో 1,58,117 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 18 వేలని తెలిపారు. యూపీఏ సర్కారు రైతు వ్యతిరేక విధానాల వల్ల అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి ఎర్రబెల్లి
దయాకర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పేరుకే ఏడు గంటల కరెంటు.. కానీ వచ్చింది మూడు గంటలు మాత్రమేనని తెలిపారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. పొలాల్లో పని చేసుకుంటూ పాముకాటు, కరెంటు షాక్‌కు గురై చనిపోయేవారన్నారు.
నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతులను కాల్చి చంపించింది కాంగ్రెస్ వాళ్లుకాదా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్.. తెలంగాణ వ్యతిరేక వైఖరి వల్ల 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారని గుర్తుచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు జాప్యం చేయడం వల్లే ఈ బలిదానాలు జరిగాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఫర్టిలైజర్ కొరత ఉండేదని, క్యూలైన్లలో నిలబడలేక చెప్పులు వరుసలో పెట్టి వారి వంతు వచ్చినపుడు వెళ్లి ఎరువులు తీసుకెళ్లేవారని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ అయిన తర్వాత ఈ ఏడేళ్లలో వ్యవసాయంపై రూ. 3 లక్షల 87 వేల కోట్లు ఖర్సు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేసుకున్నామన్నారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులన్నింటినీ నింపుకున్నామని తెలిపారు. వీటితోపాటు రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, అందుబాటులో విత్తనాలు, ఎరువులు…ఇలా ఎన్నో రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయని కేంద్రమే ప్రకటించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.