జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మీడి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 6 కోట్లతో అభివృద్ధి చేస్తున్న రామాలయాన్ని మంత్రి సందర్శించారు. పనులపై ఆరా తీశారు.
అనంతరం వల్మీడి నుంచి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో గీత కార్మికులు తారసపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి వారి మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కల్లు బాగా పారుతోందా? లాభసాటిగా ఉంటోందా? పెన్షన్లు, బీమాలు అందుతున్నాయా? అంటూ ఆరా తీశారు. ఇదే సమయంలో మంత్రిని తమ కల్లు తాగాల్సిందిగా గౌడ సోదరులు కోరారు. తమ సంప్రదాయ కల్లును తాగి రుచి చూడాలని అభ్యర్థించారు.
దీంతో గీత కార్మికుల కోరిక మేరకు, మంత్రి ఎర్రబెల్లి కల్లు రుచి చూశారు. కల్లు బాగుందంటూ గీత కార్మికులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. ఆ పథకాల ఫలాలు అందరికీ అందాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని మంత్రి తెలిపారు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేశారు.