మహబూబాబాద్ రూరల్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని శనివారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. హాస్టల్ వంట గది, స్టోర్ రూములను, టాయిలెట్లను తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో వార్డెన్ రోజాలీనా తోపాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఎందుకని ఏటీడీవో సత్యవతిని ప్రశ్నించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం పెట్టాలని సూచించారు. పాఠశాలలో అప రిశుభ్రత, మెనూ పాటించకపోవటం వంటి వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ శశాంక, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఎర్రయ్యను ఆదేశించారు. విద్యార్థుల పట్ల బాధ్యతారహితంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ధైర్యంగా చదువుకోవాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా అధికారులకు తెలియజేయాలని సూచించారు.