హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సోలార్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు ప్రతి జిల్లాలో వెయ్యి మంది మహిళలకు స్త్రీనిధి ద్వారా రుణాలు ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విజయవంతంగా నడుస్తున్న ఇంటింటికీ సోలార్ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని సూచించారు.
బుధవారం మంత్రుల నివాస ప్రాంగణంలో పల్లెప్రగతితో పాటు, ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో విడత పల్లెప్రగతిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కొత్త సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను మొదలు పెట్టాలని, పూర్తయిన పనులకు ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా గ్రూపులకు కుట్టు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పాలకుర్తి నియోజకవర్గంలో వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా, ఫ్లిప్‌కార్ట్ వస్తువులను డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించే ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. స్త్రీనిధి ఉద్యోగుల వేతన పెంపు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ ప్రసాద్, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, ఈఎన్సీ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
సర్వేలు అన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా వచ్చాయని, రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. బుధవారం మంత్రుల నివాస ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు. బీజేపీ నేతలు మూర్ఖులని, ప్రాంతీయ పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో ప్రస్తుతం అదే జరుగుతున్నదని పేరొన్నారు. పల్లె ప్రగతిలో మా అధికారులు పాల్గొనకుండా చేశారని, ఆ సమయంలో 6 జిల్లాలలో కేంద్ర ప్రతినిధులు తనిఖీలు చేశారని గుర్తుచేశారు. కేంద్రం కావాలనే ఉపాధి నిధులను నిలిపివేసిందని, రూ.800 కోట్లు రావాల్సి ఉన్నదని వెల్లడించారు. అయినా, పల్లె ప్రగతి విజయవంతమైందన్నారు.