మహబూబాబాద్/హనుమకొండ, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాహుల్ గాంధీ సభలకు ప్రజలు వస్తలేరని, అందుకే రోడ్‌షోలతో నెట్టుకొస్తున్నాడని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. 60 ఏండ్లు అధికారమిస్తే ఏం అభివృద్ధి చేశారని, మరో చాన్స్ ఇవ్వాలని కాంగ్రెసోళ్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. ఈనెల 27న మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభల నేపథ్యంలో ఆదివారం ఆయన మహబూబాబాద్ పట్టణంలోని శనిగపురం శివారులో సభా స్థలాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందుతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్, సభాస్థలి ప్రాంగణంలో చేపట్టే పనులపై నాయకులకు పలు సూచనలు చేశారు.
అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని భట్టుపల్లిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ఓ దొంగ, బ్రోకర్, చీటర్ అని, ఆయన అన్ని పార్టీలను సర్వనాశనం చేశాడని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనమేనని ఆరోపించారు.
తెలంగాణలోని పథకాలను కాపీకొట్టినా కర్ణాటకలోఅమలు చేయలేక పోతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఎన్ని అవరోధాలు సృష్టించినా, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతిని ఆపకుండా ముందుకు పరిగెత్తించారని కొనియాడారు. ఈనెల 27న మధ్యాహ్నం రెండు గంటలకు మానుకోటలో నిర్వహించే భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ వల్లే మానుకోట అభివృద్ధి..
మానుకోట జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ఢిల్లీ నాయకులే డిసైడ్ చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మానుకోట రాళ్లకు ఉన్న పౌరుషం కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదని విమర్శించారు.