Minister Errabelli | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి.. నువ్వొక బ్రోకర్‌వి.. జోకర్‌వి అంటూ మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. రేవంత్‌రెడ్డిని మిత్ర ద్రోహి, నమ్మక ద్రోహి అని విమర్శించారు. నీ జీవితం ఎలా మొదలైందో.. నీ చరిత్ర ఏంటో తనకు బాగా తెలుసునని చెప్పారు. మీ సోదరుల్లో ఒకరు కానిస్టేబుల్.. ఇంకొకరు అటెండెర్.. నువ్వేమో అడ్వర్టయిజ్మెంట్ పోస్టర్లు వేసుకునే వాడివి.. డబ్బున్న అమ్మాయిని బోల్తా వేసి పెండ్లి చేసుకున్నావంటూ రేవంత్ రెడ్డి చిట్టా విప్పారు. తనది తాతలు, తండ్రుల నుంచే వేల ఎకరాలు ఉన్న కుటుంబమని.. మొన్ననే 250 ఎకరాలను రామచంద్ర మిషన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చానని తెలిపారు.
రేవంత్ రెడ్డి తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని.. ఆ నెపాన్ని తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను మోసం చేసి.. నాశనం చేశాడని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నాడని.. అందుకే కాంగ్రెస్ లీడర్లే ఆయన పేరును రేటెంత రెడ్డిగా మార్చారని అన్నారు. రేవంత్ రెడ్డి ఐటెం సాంగ్లాంటి వాడని టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. రేవంత్ రెడ్డి నీది బ్లాక్‌మెయిలింగ్ చరిత్ర కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బెదిరించి భూములు కాజేసుకున్నాడని తెలిపారు.
నేను ఓటమి ఎరుగని నాయకుడిని.. సీఎం కేసీఆర్ తర్వాత వరుసగా గెలిచిన నాయకుడిని అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సొంత నియోజకవర్గంలో నిలబడి గెలవలేక మల్కాజ్‌గిరిలో పోటీ చేశాడని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన కాళ్లు మొక్కాడని తెలిపారు. తనలా నీతిగా ఉంటే రాజకీయంగా ఎదగలేరని రేవంత్ రెడ్డి అన్నారని బయటపెట్టారు. పాలకుర్తిలో లీడర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని.. తన వెంట ప్రజలు ఉన్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలకుర్తి నియోజకవర్గానికి హెలికాప్టర్లో వచ్చాడని.. రోడ్డు మీద వచ్చి ఉంటే తాను చేసిన అభివృద్ధి పనులు కనిపించేవని అన్నారు. హెలికాప్టర్ నుంచి చూసినా కూడా అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. తన జీవితాంతం ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.
ఇక పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్యకర్తల సమన్వయ సమావేశం, గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కులేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఓ లుచ్చా.. లఫూట్.. బ్లాక్‌మెయిలర్ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని తన భార్య ముందే చాలాసార్లు తిట్టానని.. మోసాలు ఆపమని కోరానని.. అయినా మారలేదని తెలిపారు. మోసాలు చేయడం రేవంత్ రెడ్డి నైజం అని అన్నారు. రేవంత్ రెడ్డికి అవకాశమిస్తే తెలంగాణ నాశనమైతదని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం రెచ్చగొడతారని.. వాళ్ల ప్రలోభాలకు లొంగి బలికాకండి అని కోరారు. ఎన్నికల తర్వాత ఇప్పుడు పాలకుర్తి వచ్చి డ్రామాలు చేస్తున్న వాళ్ల అడ్రస్‌లు కూడా దొరకవని అన్నారు. మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న తనను మరోసారి ఆశీర్వదించాలని పాలకుర్తి ప్రజలను కోరారు.