వరంగల్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను పట్టించుకోకపోవడంతోనే ప్రజలపై బీజేపీ గుండాలు దాడులు చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. బౌన్సర్లు, గుండాలు బీజేపీ కండువాలు వేసుకొని సామాన్యులపై దాడులకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, టీ రాజయ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారా ణి, కుడా చైర్మన్ సుందర్రాజుయాదవ్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ వాళ్లు చేయించిన దాడిలో సత్తమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడిందని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడినా ఓపిక పట్టామని, ప్రజాస్వామ్యంపై నమ్మకంతో బండి సంజయ్‌ని ఏమీ అనలేదని చెప్పారు.
పాదయాత్ర పేరుతో మంగళవారం జనగామ జిల్లాలో విధ్వంసం సృష్టించడానికి బండి సంజయ్ కుట్ర పన్నారని, టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయాలని బీజేపీ వాళ్లను రెచ్చగొట్టారని ఆరోపించారు. పోలీసులను బెదిరించి రౌడీయిజానికి దిగాడని చెప్పారు. టీఆర్ఎస్ సైన్యం తిరగబడితే నువ్వు ఎకడుంటావో చూసుకో అని బండి సంజయ్‌ని హెచ్చరించారు. అమిత్‌షా బూట్లు మోసి బానిస సంజయ్ అయ్యాడని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టాడని విరుచుకుపడ్డారు. బీజేపీకి ప్రజలను చీల్చి, గెలవాలని చూస్తున్నదన్నారు.