జనగామ, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరిట ఆమె స్వస్థలం జనగామ జిల్లా పాలకుర్తిలో ఎకరం స్థలంలో రూ.కోటితో ఫంక్షన్‌హాల్ నిర్మిస్తామని, జిల్లా కేంద్రంలో రజక భవనం కోసం ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. శనివారం జనగామలో నిర్వహించిన రజక వృత్తిదారుల రాష్ట్ర 3వ మహాసభలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ఆంధ్రా పాలకుల హయాంలో గ్రామాల్లో కనుమరుగయ్యే స్థితికి చేరుకున్న కులవృత్తులకు.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలతో పూర్వవైభవం వచ్చిందని చెప్పారు. చాకలి ఐలమ్మను నాటి పాలకులు గుర్తించలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆమె జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణులకు సబ్సిడీపై వృత్తిపరమైన పరికరాలను, ఇస్త్రీ దుకాణాలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. తొర్రూరు, వరంగల్ వంటి మున్సిపాలిటీల్లో దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేసి దోబీగాట్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వందకోట్ల విలువైన రెండెకరాల స్థలంలో హైదరాబాద్‌లో రజక ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని చెప్పారు. రూ.5.50 లక్షలతో ప్రతి మండల కేంద్రంలో బట్టలు ఉతికి ఆరేసే ఆధునిక యంత్రాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.