హైదరాబాద్, మార్చి 18 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వంపై శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిప్పులు చెరిగారు. ‘చట్టం అధికార పార్టీ చుట్టమైందా?’ అంటూ మండలి చైర్మన్‌ను నిలదీశారు. ‘అసెంబ్లీలో వారికో చట్టం.. మాకో చట్టమా?’ అంటూ ఫైర్ అయ్యారు. ‘అసెంబ్లీ సాక్షిగా బట్టలిప్పికొడతానన్న సీఎంకు రూల్స్ వర్తించవా’ అని ప్రశ్నించారు. సీఎం అసెంబ్లీలో అలా మాట్లాడుతుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు. మంగళవారం ఫ్యూచర్ సిటీపై చర్చలో శంభీపూర్ రాజు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నలతో మంత్రులను ఉక్కిరిబిక్కిరి చేశారు.
మండలిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వర్సెస్ మండలి చైర్మన్ ఎపిసోడ్ కొనసాగింది. ఒక్కసారిగా మండలి వాతావరణం వేడెక్కింది. ఫోర్త్ సిటీపై ప్రశ్నల్లో భాగంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ ‘సారేమో (చైర్మన్) ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కానీ బటయ అందరూ ఫోర్త్ సిటీ అని, బ్రదర్స్ సిటీ అని అంటున్నారు. పేపర్లలో కూడా వస్తున్నాయి’ అని అన్నారు. శంభీపూర్ రాజు బ్రదర్స్ సిటీ అనడంపై కాంగ్రెస్ సభ్యులు, మంత్రులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతలోనే కల్పించుకున్న చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ‘ రాజు అన్వాంటెడ్ కామెంట్స్ చేయొద్దు.. డిలీట్ చేస్తా’ అని అనడంతో రాజు స్పందిస్తూ తాను సీఎం పేరు ప్రస్తావించలేదని సమాధానిమిచ్చారు. అదే విధంగా ‘సార్.. అసెంబ్లీలో బట్టలిప్పికొడతా అన్న వాళ్లకేమో రూల్స్ వర్తించవు.. మాకు మాత్రం రూల్స్ వర్తిస్తాయా?’ అంటూ ప్రశ్నించారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ‘ఈ హౌస్‌లో మాత్రమే మాట్లాడండి.. బయట హౌస్ గురించి మాట్లాడొద్దు’ అని వారించారు. దీనిపై ఎమ్మెల్సీ స్పందిసూ ‘నేను ఎవరి పేరూ తీసుకోకుండా మాట్లాడితే.. అభ్యంతరం ఎలా వ్యక్తం చేస్తారు? వారికో చట్టం.. మాకో చట్టమా? చట్టం అధికార పార్టీ చుట్టమైందా? మాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయా?’ అంటూ ప్రశ్నించారు. మళ్లీ చైర్మన్ స్పందిస్తూ ‘అవన్నీ బయట మాట్లాడుకోండి.. హౌస్‌లో కాదు’ అంటూ వారించారు. దీనిపై ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ ‘బయట కాదు.. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడొద్దని అప్పుడు అబ్జక్షన్ చెప్పాలి కదా?’ అని అన్నారు. ‘అధికార పక్షానికి ఓ చట్టం, ప్రతిపక్షానికి ఓ చట్టం ఉన్నదా?.. అంబేద్కర్ ఆలా రాశారంటే నేనేం చేయలేను అధ్యక్షా’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ విధంగా కొద్దిసేపు మండలిలో చైర్మన్ వర్సెస్ శంభీపూర్ ఎపిసోడ్ కాక పుట్టించింది.
ఫోర్త్‌సిటీ అంశంలో మంత్రి శ్రీధర్‌బాబు వర్సెస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నట్టుగా కొనసాగింది. శంభీపూర్ రాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు కాస్త తడబడుతూ సమాధానం చెప్పారు. ‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యక్రమం, కార్యాచరణ జరగలేదు’ అని తెలిపారు. 770 స్కేర్ కి.మీ పరిధిలో 56 గ్రామాలతో ఫోర్త్ సిటీ ఉండబోతున్నదని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో కొంత భాగంలోనే 8 ప్రముఖ ఫార్మా కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించబోతున్నాయని తెలిపారు. ఏ రైతుకు సంబంధించి కూడా ఇబ్బంది లేదని, భూమి కోల్పోయిన రైతులకు అన్ని విధాలా పరిహారం అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఇంకేదో చేయాలనుకున్నప్పుడు భూసేకరణ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 770 స్కేర్ కి.మీ పరిధిలోనే ఉన్నదని, ఎలాంటి భూసేకరణ చేయలేదని మరోసారి స్పష్టంచేశారు.
భూసేకరణ చేయకుండా
ఫోర్త్‌సిటీకి భూసేకరణ చేయలేదంటూ మంత్రి దుద్దిళ్ల ఇచ్చిన సమాధానంపై ఎమ్మెల్సీ రాజు మరోసారి ప్రశ్నలు సంధించారు. ‘ఫ్యూచర్‌సిటీకి ల్యాండ్ అక్వేషన్ చేయలేదన్నారు.. మరి భూసేకరణ చేయకుండా ఫ్యూచర్ సిటీ ఎలా చేద్దామనుకుంటున్నారు?’ అంటూ ప్రశ్నించారు. అంటే గత ప్రభుత్వం ఫార్మాసిటీకి కేటాయించిన భూమిని ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా? లేక ఆ భూమిని ఫ్యూచర్‌సిటీకి బదలాయిస్తున్నారా? అని ప్రశ్నించారు.
అవును.. రాజు చెప్పినట్టు..
కొత్త నగరం ఏర్పాటు అంత సులువు కాదన్న శంభీపూర్ రాజు అభిప్రాయంతో మంత్రి శ్రీధర్‌బాబు ఏకీభవించారు. ఆయన చెప్పిన అంశాన్ని అంగీకరించారు. ‘రాజు చెప్పినట్టుగా కొత్త నగరం ఏర్పాటు అంత ఈజీ కాదు. ఇది డిఫికల్ట్ టాస్క్. బట్ వి టేక్ దట్ చాలెంజ్’ అన్నారు.
ఫ్యూచర్ సిటీపై శంభీపూర్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సిటీలు, కొత్త నగరాల ఏర్పాటు అనేది అంత ఈజీ కాదని, అది సాధ్యమయ్యే పని కూడా కాదని చెప్పారు. తాను ఇటీవల చైనాలో పర్యటించానని, అక్కడ గెస్ట్ సిటీ పేరుతో కొత్త నగరం ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ అక్కడ ప్రజలు లేరని, ఇండస్ట్రీ లేదని చెప్పారు. ఈ విధంగా వాస్తవిక ఆలోచనలో ఉండాలని సూచించారు. ‘అంతేగాని గత ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి పేరు మార్చుతాం అంటే ఎలా? పేరు కాదు ప్రజల ప్రమాణాలు మార్చండి’ అని రాజు సూచించారు.
ఫోర్త్‌సిటీ అంశంపై ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తన ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. ‘మంత్రి శ్రీధర్‌బాబు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రణాళిక ఉన్నదని, ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. మరి ఫోర్త్‌సిటీ కోసం ఇప్పటి వరకు ఏమైనా భూసేకరణ చేశారా? చేస్తే ఎన్ని ఎకరాలు చేశారు? రైతులకు ఏమైనా పరిహారం ఇచ్చారా? ఇస్తే ఏ విధంగా ఇచ్చారు?’ అంటూ ప్రశ్నించారు. ‘కరోనాకు వ్యాక్సిన్ అందించిన చరిత్ర మాది.. అందుకే మా ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చాలా దూరదృష్టితో ఫార్మాసిటీ భూసేకరణ చేశారు. అప్పుడు ప్రస్తుత పీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఆ భూములను తిరిగి రైతులకు వాపస్ ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఇస్తున్నారా? లేక అదే భూమిలో ఫ్యూచర్ సిటీ చేస్తున్నారా? లేక వేరే భూమిని సేకరిస్తున్నారా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో భూసేకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రస్తుత పాలకులు, ఇప్పుడు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు.