పాలకుర్తి నియోజకవర్గం: భారతదేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి, రైతు సర్కారును భారత పీఠం మీద ఎక్కించే లక్ష్యంతో ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ తొలి బహిరంగ సభకు తెలంగాణ సర్వం సమాయత్తమైంది. ఖమ్మం గుమ్మం దీనికి వేదిక అయింది. భారతదేశానికి తెలంగాణ గడ్డ మీద నుంచి సందేశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, పినరయ్ విజయన్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వంటి మహామహులు హాజరవుతున్న ఈ సమావేశానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలుతున్నారు.
సభలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సకల సదుపాయాలను సమకూర్చుతున్నారు. మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరుతో పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగరకు చెందిన అభిమానులు మంచినీళ్ల బాటిలను తయారుచేసి సభలో కార్యకర్తలకు దాహం తీర్చేందుకు సిద్దం అయ్యారు.
భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి, ప్రపంచానికి మకుటాయ మానంగా వెలిగేందుకు, రైతు ఈ దేశానికి రాజు అయ్యేందుకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ సభ వైపు దేశ మొత్తం ఆసక్తిగా చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎజెండా ఈ దేశ భవితవ్యానికి దిక్సూచి కానుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పే ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర మొదటి అడుగు కావాలని ఆకాంక్షించారు.
సభకు హాజరయ్యేందుకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వస్తున్న బస్సులకు జెండా ఊపి మంత్రి స్వాగతం పలికారు.