యాదగిరిగుట్ట : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికకు ముందు, తర్వాత వచ్చానని.. మరోసారి గెలుపొందిన తర్వాత వస్తానన్నారు. లక్ష్మీనరసింహస్వామి మా ఇలవేల్పని, తిరుమల తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునః నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు దేవాలయ ప్రాంగణంలో కనిపించిన భక్తులతో కొద్దిసేపు మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకుంటూ ఎక్కడెక్కడ నుంచి వచ్చారంటూ వాకబు చేశారు. చరిత్రలో నభూతో నభవిష్యతీ అన్న చందంగా సీఎం కేసీఆర్ ఆలయాన్ని తీర్చిదిద్దారన్నారు. దేవాలయం మొత్తం అత్యంత భక్తి ప్రపత్తులతో నిండి ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాకే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహస్వామిని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.