హైదరాబాద్ : ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పాలకుర్తి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో మంత్రి దయాకర్‌రావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
మంత్రి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించకున్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు, నేతలు కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక ఎన్నికలు మన ఐక్యతను చాటాయని, అందుకే ప్రతిపక్షాలు కనీసం అభ్యర్థిని నిలిపేందుకు సాహసించలేదు అన్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం సాధ్యమైందన్నారు. ఈ ఘనత జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లదేనన్నారు. ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు బంపర్ మెజారిటీ సాధించారని అభినందించారు. భవిష్యత్‌లో తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వారికి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.