హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతలు రూ.40 వేల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్ నేత గోపగాని రఘురామ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పదెకరాల పట్టా భూమి మాటున 500 ఎకరాలపైగా ప్రభుత్వ భూమి కబ్జా చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అనుచరులు భూ రిజిస్ట్రేషన్లు జరుపుతున్నారని ఆరోపించారు.
సర్వే నంబర్ 30లోని భూములపై కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఎందుకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? ప్రైవేట్ వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది? కబ్జాకు సూత్రధారులైన మంత్రి దామోదరతోపాటు సహకరిస్తున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దీనిపై న్యాయ విచారణ ఎందుకు జరిపించడం లేదు?’ అని నిలదీశారు. సుల్తాన్ఫూర్లోని సర్వే నంబర్ 30లో ఉన్న 720 ఎకరాల భూమిపై అక్రమాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయని చెప్పారు.
‘సర్వే నంబర్ 30లోని భూముల వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నా 30/1,2 అంటూ బై నంబర్ సృష్టించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేశారు.. ఎలా రిజిస్ట్రేషన్ చేశారో ప్రభుత్వం చెప్పాలి’ అని క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. అకడ ఎవరెవరు తిరిగారో ఏయే కార్లు ఆ ప్రాంతానికి వచ్చాయో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తెల్లాపూర్తోపాటు అమీన్పూర్, పటాన్చెరు మున్సిపాలిటీల్లో ఇల్లు, ఇతర పర్మిషన్ పొందాలంటే మంత్రి దామోదరను కలవాలని అధికారులు సూచించడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని రక్షించి, నిరుపేదలు, దళితులకు ప్లాట్లుగా కేటాయించాలని కోరారు. అవినీతి మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.