హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గ్రూప్-1 ఆఫీసర్లు కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. గురువారం సెక్రటేరియట్లో దామోదర్ రాజనర్సింహను కొత్తగా వైద్యశాఖకు కేటాయించిన అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానాల పనితీరు, ఆరోగ్య రంగంలో సాంకేతికత, గ్రామీణ ప్రాంత ప్రజల చెంతకు స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులకు మంత్రి వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశాఖలో పనిచేసే అవకాశం దకడం అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు అత్యంత పేద ప్రజలు వస్తుంటారని, వారిని ఆప్యాయంగా ప్రేమ గా చూసుకునే బాధ్యత ఈ శాఖలో పనిచేసే ప్రతి ఒకరిపై ఉన్నదని గుర్తుచేశారు. ఒకప్పటిలా అంటువ్యాధుల సమస్య లేదని, వాటి స్థానంలో లైఫ్ ైస్టెల్ డిసీజెస్ సమస్య పెరిగిందని, వాటిపై అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, ఎన్సీడీ క్లినిక్స్ ఏర్పాటుతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.