హైదరాబాద్ : పాశమైలారం పేలుడు(Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమలో సంభవించిన పేలుడులో 11 మంది కార్మికుల ఆచూకీ దరొకడం లేదన్నారు. ఇప్పటి వరకు 36 మంది మరణించారన్నారు. అలాగే 18 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని రాజనర్సింహ తెలిపారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న కార్మికుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
కాగా, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కార్మికులు, సిబ్బంది మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. ప్రమాదంలో 36 మంది మరణించినట్టు మంగళవారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 14 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉన్నది.